Monday 15 September 2014

దేశంలోనే తొలిసారిగా పేపర్ లెస్‌ ఏపీ మంత్రివర్గ భేటీ...

హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా పేపర్ లెస్‌ మంత్రివర్గ సమావేశాన్ని జరిపిన ఘనత ఏపీ క్యాబినెట్‌ సొంతం చేసుకుంది. ఐపాడ్‌లు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో సమీక్ష జరిపింది.
మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు
లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో వందరోజుల పాలనపై మంత్రులు చర్చించారు. అక్టోబర్‌ 2న ప్రారంభించాల్సిన 3 పథకాలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వృద్ధాప్య పింఛన్లు, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, 24 గంటల విద్యుత్ సరఫరా, ఎన్టీఆర్‌ క్యాంటిన్లు ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. అదే రోజున ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకాన్ని ప్రారంభించాలని సంకల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి.. 2 లక్షల 50 వేల వరకు నగదు రహిత వైద్యం అందించడానికి ఆమోదం తెలిపింది.
రుణమాఫీ మూడు దశల్లో అమలు
రుణమాఫీ మూడు దశల్లో అమలు చేస్తామని మంత్రివర్గం వివరించింది. నిధుల సేకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అనంతపురం జిల్లా ఎంపీ కుంటలో ఎంపీటీసీ ద్వారా వెయ్యి మెగావాట్లు, కర్నూలు పాణ్యంలో 5000 మెగావాట్లు, కడప జిల్లా గాలివీడు వెయ్యి మెగావాట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాణ్యమైన విద్యుత్‌ రైతులకు అందించేందుకు దేశంలో తొలిసారిగా 9624 పీడర్లపై ఆన్‌లైన్‌ మానిటరింగ్‌కు ఓకే చెప్పింది.
ఐటీ రోడ్‌ షోలకు విశేష స్పందన
ఐటీ రోడ్‌ షోలకు విశేష స్పందన లభించిందని క్యాబినెట్‌ స్పష్టం చేసింది. విప్రో, టెక్‌ మహీంద్ర, శామీర్ సంస్థలు విశాఖలో సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని పేర్కొంది. అలాగే కాకినాడలో హార్డ్ వేర్ పార్కు, ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నాయని తెలిపింది. వచ్చే ఏడాదికి మంత్రుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
హీరో మోటార్ ఫ్యాక్టరీకి 600 ఎకరాలు..?
చిత్తూరు జిల్లా సత్యవేడు సెజ్‌లో హీరో మోటార్ ఫ్యాక్టరీకి 600 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. శ్రీసిటి సెజ్‌లో సుమారు 2200 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది. వందరోజుల పాలనపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులందరూ తమ పనితీరును స్వయంగా సమీక్షించుకుని నివేదికలు ఇవ్వాలని బాబు సూచించారు. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అర్హత ఉన్నవారికి అవకాశం కల్పించే విషయంపై కేబినెట్ చర్చించింది. ఈ అంశంపై ఢిల్లీకి రాసిన లేఖపై సంబంధిత మంత్రిత్వ శాఖను కలిసి స్పష్టత తేవాలని మంత్రి గంటను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి లబ్దిదార్లకు నేరుగా అందేలా చూడాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

No comments:

Post a Comment