Tuesday 16 September 2014

కమలనాథులకు షాకిచ్చిన జనం..

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో లెక్క తప్పింది. రాజస్థాన్‌లో ఎదురుగాలి వీచింది. తెలుగు రాష్ట్రాలు కరుణించలేదు. ఈశాన్య రాష్ట్రాలు పట్టించుకోలేదు. గుజరాత్‌ ఫలితం షాకిచ్చింది. 10 రాష్ట్రాల్లో ఉపఎన్నికల  ఫలితాలు కమలనాథులకు షాకిచ్చాయి. మోడీ వేవ్‌తో సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ బైపోల్ ఫలితాలతో బెంబేలెత్తిపోయింది. ఉప ఫలితాలు కాంగ్రెస్‌కు మోదాన్ని, బీజేపీకి ఖేదాన్ని మిగిల్చాయి. 
సిట్టింగ్ పార్టీలదే విక్టరీ..
    దేశవ్యాప్తంగా వడోదర, మెదక్‌, మెయిన్‌పురి లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ పార్టీలే విక్టరీ సాధించాయి. మెదక్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, వడోదరలో బీజేపీ అభ్యర్థి రంజన్‌భట్ సాధించారు. మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ సిన్హా గెలుపొందారు. 
నాలుగు నెలల్లోనే బీజేపీకి ఎదురీత..
    అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీకి జనం ఝలక్ ఇచ్చారు. నాలుగు నెలల్లోనే కమలనాథులకు ఎదురీత కలిగింది. యూపీఏ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగెత్తి బీజేపీకి పట్టం కట్టిన ప్రజలు, బై పోల్స్ లో కంగుతినిపించారు. 33 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాషాయదళానికి నిరాశే మిగిలింది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోకల్ పార్టీలకే జనం జై కొట్టారు. 100 రోజుల పాలన భేష్ అంటూ దూకుడు మీదున్న కమలదళానికి కళ్లెం వేశారు. 
యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ..
    యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. నాలుగు నెలల క్రితం హారతి పట్టిన ఓటర్లే కమలదళానికి బ్రేకులేశారు. 11 అసెంబ్లీ స్థానాల్లో ములాయం పార్టీ 9 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ మాత్రం 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 4 అసెంబ్లీ స్థానాల్లో మూడింటిని హస్తగతం చేసుకుంది. అధికారంలో ఉన్న వసుంధరా రాజే సర్కార్ ఒక్కచోటే విజయం దక్కించుకుంది. మోడీ సొంత రాష్ట్రంలోనూ కమలానికి చుక్కెదురైంది. అయితే పట్టు నిలుపుకుంది. 9స్థానాలకు గానూ బీజేపీ 6 సీట్లను, కాంగ్రెస్‌ 3 సీట్లను కైవసం చేసుకుంది. తమకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన సిట్టింగ్ స్థానాలను సైతం సాధించలేకపోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే.
బెంగాల్‌లో ఖాతా తెరచిన బీజేపీ..
    బెంగాల్‌లో బీజేపీ ఖాతా తెరిచింది. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. మరోస్థానంలో టీఎంసీ గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అభ్యర్థి సౌమ్య విజయం సాధించారు. త్రిపురలో సీపీఎంకు  విజయం దక్కింది. అసోంలో కాంగ్రెస్, బీజేపీ, ఏఐయుడిఎఫ్ చెరో స్థానంలో గెలుపొందారు. 
హస్తంకు ఊరట కలిగించిన ఉపఫలితాలు..
    మొన్నటికి మొన్న బీహార్, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ నాలుగు రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీకి ఏడు స్థానాలు మాత్రమే దక్కాయి. కేంద్రంలో పగ్గాలు చేపట్టి వంద రోజులైనా ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోవడం కమలదళానికి ప్రమాదకర సంకేతమే. బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ఓటర్ల ఆకాంక్షలకీ, మోడీ ప్రభుత్వ పనితీరుకీ ఎక్కడో తేడా వచ్చిందన్న విషయాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను సరిగా పోల్చుకోకుండా, కార్పొరేట్‌ ప్రభువులను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తే ఓటర్లు క్షమించరన్న విషయం ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో తేలిపోయింది. అయితే అస్తవ్యస్థంగా ఉన్న హస్తం పార్టీకి ఫలితాలు ఊరట కలిగించాయి. అదే ధైర్యంతో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు హస్తం నేతలు సిద్ధమవుతున్నారు. 

1 comment:

  1. In the same style, your comment on the results of State Elections in Haryana and Maharashtra.

    ReplyDelete