Tuesday 18 November 2014

తెరాసలో చేరనున్న మరో విపక్ష సభ్యులు.. కేసీఆర్ ప్రోత్సాహంతో

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో ప్రతిపక్షాలకు చెందిన మరో నలుగురు శాసనసభ్యులు చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నలుగురిలో కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
మరోవైపు సాక్షాత్ ముఖ్యమంత్రే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనీ దీనిపై సభలో చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టి ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌కు గురైన విషయం తెల్సిందే. తమ పార్టీ శాసనసభ్యులను నిలువరించుకోవడానికే కాంగ్రెస్ శాసనసభ్యులు శాసనసభలో దుమారం రేపినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ టిఆర్ఎస్‌లోకి వలసలు ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకే తాము తెరాసలో చేరుతున్నట్లు పార్టీ మారుతున్న శాసనసభ్యులు చెబుతున్నారు. ఇటీవలే టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ శాసనసబ్యుడు కె. యాదయ్య వ్యవహారంపై అధికార టిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షాలకు మధ్య శాసనసభ ఆవరణలో మాటల యుద్ధం నడిచిన విషయం తెల్సిందే.

No comments:

Post a Comment