Saturday, 4 October 2014

నిందితులపై కేసు నమోదుకు కేసీఆర్ ఆదేశం

మెదక్ : మెదక్ జిల్లా రామక్కపేట అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. నిందితులపై వెంటనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన శనివారం ఆదేశించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం కింద రూ.25వేలు అందించాలని కేసీఆర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సూచించారు. ఈ ఘటనపై కేసీఆర్...రామలింగారెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. రామక్కపేటలో నలుగురు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
 

అమ్మని లేపితే లేస్తల్లేదు....

హైదరాబాద్ : రాజేంద్ర నగర్ లో బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకు వెళ్లారు. లారీ పార్కింగ్ సమీపంలో తన కుమార్తెతో కలిసి రమ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది.
 
అయితే ఈరోజు ఉదయం ఆమె కుమార్తె ...తల్లిని ఎంత లేపినా లేవటం లేదని ఏడుస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కర్ణాటక వాసి. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తల్లి చనిపోయిన విషయం తెలియని చిన్నారి మాత్రం...అమ్మను లేపుతున్నా లేవటం లేదంటూ అమాయకంగా చెబుతోంది.

మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..

ఇస్లామిక్ మిలిటెంట్లు (ఐఎస్ఐఎస్) మరో బ్రిటన్ పౌరుడిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. తమ వద్ద బందీగా ఉన్న బ్రిటన్ పౌరుడు అలన్ హెన్నింగ్స్‌ను శుక్రవారం దారుణంగా హతమార్చి, ఆ దుశ్యర్యను వీడియో తీసి విడుదల చేశారు. అలాగే, బందీగా ఉన్న అమెరికా యుద్ధ నిపుణుడు పీటర్ కిస్సింగ్‌ను కూడా హతమారుస్తామని తాజాగా వీడియోలో మిలిటెంట్లు ప్రకటించారు.
 
తాజా దుశ్చర్యతో ఇద్దరు బ్రిటన్ పౌరులను మిలిటెంట్లు హత్య చేసినట్లైంది. మిలిటెంట్ల తాజా దుశ్చర్యపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పౌరులను చంపేస్తున్న మిలిటెంట్లను వేటాడి, వెంటాడి తీరుతామని హెచ్చరించారు. మరోవైపు.. సిరియాలోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్ స్థావరాలపై అమెరికా సేనలు ముమ్మరంగా దాడులు చేస్తున్న విషయం తెల్సిందే. 

గర్వంగా ఉంది: మోడీ ఎంపికపై కమల్ హాసన్

గర్వంగా ఉంది: మోడీ ఎంపికపై కమల్ హాసన్
చెన్నై: స్వచ్ఛ భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన తొమ్మిది మందిలో తాను ఒకడిని కావడం గర్వంగా ఉందని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. తొమ్మిది జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధానికి మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం మోడీ విసిరిన సవాల్ ప్రతిష్టాత్మకమైన ఆహ్వానమని ఆయన అన్నారు. తన పేరును ఆ జాబితాలో చేర్చడం మోడీ ఔదార్యానికి నిదర్సనమని ఆయన అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రాభించారు. తన అభిమానులు గత ఇరవై ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. తన అబిమానుల క్లబ్‌లను సామాజిక సంక్షేమ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. తాను ఇప్పటికే చేస్తున్న సేవా కార్యక్రమాలకు మోడీ ఆహ్వానం గుర్తింపు అని ఆయన అన్నారు జాతి నిర్మాణంగా దీన్ని తాను పరిగణించి సాధ్యమైతే 9 మంది మిలియన్ల మందిని ఇందులో భాగస్వాములను చేస్తానని శుక్రవారం అన్నారు.

రావణ దహనంలో దారుణం.. 33 మంది మృతి.. 20 మందికి గాయాలు!

విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయనుకుంటున్న దశలో దారుణం చోటుచేసుకుంది. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనికి లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. 
 
ఉత్సవాలు ముగిసిన సందర్భంలో అందరూ ఒకేసారి మైదానం బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 33 మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. 
 
కొందరు ఆకతాయిలవల్ల తోపులాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో దసరా ఉత్సవాలు విషాదాంతమయ్యాయి.

దేవరగట్టులో కర్రల సమరం బాలుడి మృతి

కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి దసరా రోజున ‘బన్నీ ఉత్సవం’ పేరిట జరిగే కర్రల సమరం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 సంవత్సరాల బాలుడు మరణించాడు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ ఏడాది కూడా దేవరగట్టులో కర్రల సమరం సమయానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని సమరానికి సిద్ధమయ్యారు. కర్రలతో, కాగడాలతో పరుగులు పెట్టారు. సంప్రదాయం పేరిట జరిగే ఈ పోరాటంలో ఎంతోమంది తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఇదిలావుంటే చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని స్థానిక పోలీసులు అంటున్నారు

జీన్స్‌ కామెంట్స్‌తో యేసుదాస్‌కు తలనొప్పి: కేరళ కాంగ్రెస్ ఫైర్

మహిళల వస్త్రధారణపై ప్రముఖ గాయకుడు జేసుదాస్ (యేసుదాస్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు మండిపడుతున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఫైర్ అయ్యింది. నేపథ్యగాయకుడు జేసుదాసు పాటలు పాడితే మంచిదని, మహిళల వస్త్రాధారణపై కామెంట్స్ వద్దని హితవు పలుకుతున్నారు. 
 
గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో జేసుదాస్ పాల్గొని మాట్లాడుతూ జీన్స్ వంటి వస్త్రాధారణ వల్లే మహిళలు ఇబ్బందులు పాలవుతున్నారని, ఇలాంటి వస్త్రాధారణ భారతీయ సంస్కృతి కాదనీ, అందువల్ల నిండైన వస్త్రాధారణ ధరించాలని సూచించారు. 
 
దీనిపై కేరళ మహిళా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని జేసుదాసు అన్నారు. జేసుదాస్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని కేరళ మహిళా కాంగ్రెస్ నేత బిందు కృష్ణ అన్నారు. గాయకుడిగా జేసుదాస్‌ని భారతీయులంతా అభిమానిస్తారని, సంగీతానికి జేసుదాస్ అందించిన సేవలకు గర్విస్తారని ఆయన అన్నారు. ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమని బిందుకృష్ణ అన్నారు.