Sunday, 30 November 2014

కరీంనగర్‌లో పేలుడు, చెల్లాచెదురైన శరీర భాగాలు

హైదరాబాద్: కరీంనగర్‌ శివారులో ఉన్న హౌజింగ్‌బోర్డు కాలనీ ఓ ఇంట్లో ఆదివారం ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. ఈ పేలుడు సంఘటనలో కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన పట్నం నాగార్జున కుమార్‌ (34), మ ల్లు రామకృష్ణారెడ్డి (60)లు దుర్మరణం చెందగా పట్నం శ్రీనివాస్‌కుమార్‌ (26)కు తీవ్రగా యా లతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరబాద్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పట్నం నాగార్జున కుమార్‌, శ్రీనివాస్‌ కుమార్‌ సోదరులు 12 సంవత్సరాల నుంచి కరీంనగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో దేవతలు, ఇతర బొమ్మలు తయారు చేసి విక్రయిస్తుంటారు. వీరి వద్ద వంట మనిషిగా అదే గ్రామానికి చెందిన మల్లు రామకృష్ణారెడ్డి పని చేస్తున్నాడు. ఇంట్లోని రెండు గదులను గోదాంగా చేసి అక్కడే బొమ్మల తయారీకి ఉపయోగించే రసాయనాలు నిల్వ ఉంచుతారు. అయితే శనివారం మద్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంటి ఆవరణలో పేలుడు జరిగింది. గడువు ముగిసిన హార్డినరీ రసాయనంపై ఒత్తిడి కారణంగానే అది పేలిందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక పోస్టాఫీసుల్లోనూ శ్రీవారి దర్శన టికెట్లు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్‌ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
 
చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులోను, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభిస్తారు.
 
ఇవి ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారని తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు

మరోసారి తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ముంబై, నవంబర్‌ 30 : వాహనదారులకు శుభవార్త... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోలు లీటరుపై 91 పైసలు, డీజిల్‌పై 84 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 70 లు కన్నా దిగువకు రానునంది. లీటరు డీజిల్‌ ధర స్థానిక పన్నులతో కలిసి రూ. 57 రూపాయలకు చేరనుంది. తగ్గిన పెట్రో ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర 70 డాలర్లకన్నా తక్కువకు పడిపోవడంతో ఈ మేరకు ధరలు తగ్గాయి. పెట్రోలు ఎగుమతి దేశాలు సైయితం ఉత్పత్తిని తగ్గించబోమని ప్రకటించాయి

ఈవ్‌ టీజర్‌ భరతం పట్టిన ఇద్దరు అమ్మాయిలు


హర్యానా, నవంబర్‌ 30 : బస్సులో ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన పోకిరిని ఇద్దరు అమ్మాయిలు బెల్ట్‌ తీసి చితక్కొట్టారు. ఈ ఘటన హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగింది. బస్సులో అంతమంది ప్రయాణీకులు ఉన్నా ఎవరూ వీరికి సాయం రాలేదు. ఆ ఇద్దరు అమ్యాయిలే ధైర్యంగా పోకిరీని ఎదుర్కొన్నారు. దాంతో ఆగకుండా ఆ పోకిరిని పోలీసులకు అప్పగించారు

Friday, 28 November 2014

బతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం

ఈ అభిమానులనేవాళ్ళున్నారే.. ఒక్కోసారి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియదు. సాధారణంగా ఎవరైనా పోయాక విగ్రహాలు పెడతారు. అభిమానం ముదిరిపోయిన అభిమానులు తాము అభిమానించే వారికి బతికుండగానే విగ్రహాలు పెట్టేస్తారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లో మాయవతి విగ్రహాలు అలాగే పెట్టారు. అలాగే తెలంగాణ దేవత సోనియాకి గుడి కట్టించి, అందులో ఆమె విగ్రహాన్ని కూడా మాజీ మంత్రి శంకర్రావు ఇటీవల పెట్టించారు. ఇప్పుడు బతికుండగానే విగ్రహాలు పెట్టించుకునే లిస్టులోకి పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పవన్‌కళ్యాణ్ విగ్రహం ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పెనుమంట్ర మండలంలోని నత్తారామేశ్వరంలో విగ్రహం కూడా తయారైపోతోంది. కొంతమంది జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్డర్ ఇచ్చిన మీదట ఈ గ్రామానికి చెందిన శిల్పి అరుణప్రసాద్ వడయార్ పవన్ కళ్యాణ్ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీనిమీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.



శ్వేతాబసు ప్రసాద్.. మళ్ళీ నటన

సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని రెస్క్యూ హోమ్‌కి పంపిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని శ్వేతాబసు ప్రసాద్ చెబుతోంది. నిజానిజాలు ఎలా వున్నప్పటికీ శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ తన నట జీవితాన్ని కొనసాగించడం అభినందనీయమైన విషయం. శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం నటిస్తున్న డాక్యుమెంటరీలో ఆమె చాలా కీలకమైన పాత్ర ధరిస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నతనంలోనే నటిగా జాతీయ అవార్డును పొందిన శ్వేతా బసు ప్రసాద్ ఈ డాక్యుమెంటరీలో కూడా జాతీయ స్థాయి అవార్డు పొందేంత మంచి పాత్రను ధరిస్తున్నట్టు సమాచారం. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.

ఉదయ్‌కిరణ్‌ హత్య దారుణం..

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారం‌లో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్‌కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్‌కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్‌కిరణ్ మృతదేహం కనిపించింది. ఉదయ్ కిరణ్‌ని హత్య చేసిన వారు శవాన్ని నీటిలో వేశారు. శవం పైకి తేలకుండా ఉండటానికి మృతదేహం మీద పెద్ద బండరాయిని పెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఉదయ్ కిరణ్‌ని అతని పెదనాన్న కుమారుడు నవీన్ హత్య చేసినట్టు కనుగొన్నారు. నవీన్ శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. పెద్దల మధ్య వున్న ఆస్తి గొడవల కారణంగానే నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఉదయ్ తల్లిదండ్రులకు చాలాకాలానికి కలిగిన కుమారుడు. అది కూడా సరోగసీ పద్ధతి ద్వారా జన్మించాడు. ఉదయ్ కిరణ్‌ని చంపిన నవీన్ గత కొంతకాలంగా ఏ పనీలేక జులాయిగా తిరుగుతున్నాడు. గతంలో హోంగార్డు ఉద్యోగాన్ని సంపాదించాడు. నకిలీ ధ్రువపత్రాలతో హోంగార్డు ఉద్యోగం పొందిన అతనిని విధుల నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.