Thursday, 16 October 2014

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. 22న మంత్రివర్గ విస్తరణ ఖాయమా?

k chandrasekhar raoతెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం రాత్రి సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు ఏకబిగువున 2 గంటల పాటు చర్చలు జరిపారు. కేసీఆర్ ఉన్నట్టుండి గవర్నర్‌ను కలవడంతో మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు చెలరేగాయి. దీంతో ఖచ్చితంగా ఈనెల 22వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణుల భావిస్తున్నాయి. 
 
వాస్తవానికి దీపావళి తర్వాత ఈనెల చివరి వారం లేదా నవంబర్‌లో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో విపక్షాలను ధీటుగా ఎదుర్కోవటానికి మంత్రివర్గాన్ని విస్తరించాలనే యోచనతో సీఎం ఉన్నట్లు టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలు చెబుతున్నారు. మంత్రుల సంఖ్య తక్కువగా ఉంటే, విపక్షాల నుంచి శాఖల వారీగా లేదా ఇతరత్రా వచ్చే ప్రశ్నలకు జవాబులివ్వటంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విస్తరణ దిశగా ఆలోచన చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
 
ఈ మేరకు మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా, అందులో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్‌, జూపల్లి కృష్ణారావు, కొత్తగా పార్టీలో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు పేర్లు ఖాయమైనట్లేనని సమాచారం. మిగిలిన మూడు బెర్త్‌లకు ఆశావహుల సంఖ్య అధికంగా ఉండగా, సీఎం కేసీఆర్‌ అందులో ఎవరిని తన మంత్రివర్గంలోకి తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంటుందని అంటున్నారు. టీఆర్‌ఎస్‌లోని మరికొందరు నేతలు మాత్రం ఈనెల 22న మంత్రివర్గ విస్తరణ చేపట్టే ప్రచారాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. 

ఖమ్మంకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.. శ్రీజకు పరామర్శ!

pawan kalyanజనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం ఖమ్మంకు వెళ్లనున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కారణంగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి శ్రీజ కోర్కె మేరకు పవన్ ఇక్కడకు వస్తున్నారు. మృత్యువుతో పోరాడుతున్న శ్రీజ.... తనకు పవన్ కల్యాణ్‌ను కలుసుకోవాలని వుందని కోరిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయాన్ని 'మేక్ ఏ విష్' స్వచ్ఛంద సంస్థ చేరడంతో ఆ సంస్థ ప్రతినిధులు హీరోకు చేరవేశారు. దీంతో, చిన్నారి కోరికను తీర్చడానికి ఆయన తన షెడ్యూల్‌ను పక్కన పెట్టి ఖమ్మం వెళుతున్నారు. మరోవైపు తమ అభిమాన నటుడు ఖమ్మం విచ్చేస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 

తెలంగాణ హైకోర్టుకు రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్దయర్శి రాజీవ్ శర్మ గురువారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు గురించి చర్చించారు. హైకోర్టు ఏర్పాటుకు చీఫ్ జస్టిస్ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో కింగ్‌కోఠీలోని పరదా ప్యాలెస్ లేదా ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ డి భవనంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకే తాత్కాలికంగా కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. 

రుఘురాం రాజన్‌కు బ్యాంకులపై యనమల - కేసీఆర్ ఫిర్యాదు!

raghuram rajanఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు బ్యాంకులపై ఫిర్యాదు చేశారు. కొత్త రుణాలు మంజూరుకు బ్యాంకర్లు ఏమాత్రం సహకరించడం లేదని వారు తమతమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 
 
బుధవారం హైదరాబాద్‌‍కు రాజన్ రాగా, ఆయనతో వీరిద్దరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని  మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరిలు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత రాజన్ టీ సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశమయ్యారు. ‘రుణ మాఫీ’ పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌కు  ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. 
 
ఆర్‌బీఐ పరిధిని మరింత విస్తృతపరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణ వితరణతో పాటు మరింత సహకారం అందించడానికి కృషి చేస్తామని రాజన్ వెల్లడించారు. ఆర్‌బీఐ త్వరలో చిన్న బ్యాంకులకు అనుమతులు ఇవ్వనుందని..ఆ బ్యాంకులు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలిచ్చేలా చూస్తామని వివరించారు. 

చిన్నారి కోరికను తీర్చబోతున్న పవన్

ఖమ్మం జిల్లాకు చెందిన 12సంవత్సరాల శ్రీజ అనే బాలిక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఆరాటపడుతున్నది. తన కూతురి కోరికను తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువుల సలహా మేరకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులను కలిశారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ సాధిక్ అనే తీవ్ర వ్యాధిగ్రస్త బాలుడి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవ్వాలన్న కోరికను బుధవారం నాడు తీర్చింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్‌ని కలవాలని అనుకుంటున్న బాలిక గురించి మీడియా వద్ద ప్రస్తావించారు.ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శ్రీజని కలవటానికి అంగీకరించారట. ఈ రోజు లేదా రేపు ఖమ్మంలో పవన్ ఆమెను కలుస్తారట.

బాల్య వ్యభిచారం విలువ 343 బిలియన్ డాలర్లు : నోబెల్ విజేత కైలాష్ సత్యర్థి

kailash satyarthiభారత్‌లో బాల్య వ్యభిచారం విలువ 343 బిలియన్ డాలర్లుగా ఉందని నోబెల్ బహుమతి విజేత కైలాష్ సత్యర్థికి చెందిన గ్లోబల్ మార్చ్ అగెయినెస్ట్ చైల్డ్ లేబర్ అనే సంస్థ నిర్వహించి ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యభిచారం రొంపిలోకి నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి అపహరించిన అమ్మాయిలను బలవంతగా నెట్టేస్తున్నట్టు తెలిపింది. 
 
భారత్‌లో పసిపిల్లలతో చేయిస్తున్న ఈ తరహా వ్యభిచారం తరాలుగా కొనసాగుతోందని కూడా ‘ఎకానమిక్స్ బిహైండ్ ఫోర్స్ డ్ లేబర్ ట్రాఫికింగ్’ పేరిట విడుదలైన ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో 32 లక్షల మంది చిన్నారులు బలవంతంగా వ్యభిచార కూపంలో కొనసాగుతున్నట్టు తేలింది. 
 
వీరిలో 60 శాతం మంది బీహార్, అసోంలకు చెందిన చిన్నారులు కాగా, వీరంతా 14 నుంచి 16 ఏళ్ల వయసు మధ్యనున్న ఉన్నారని తెలిపారు. వీరిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది. అదేసమయంలో దేశవ్యాప్తంగా 1,100 రెడ్ లైట్ ఏరియాలుండగా, ఒక్కో రెడ్ లైట్ ఏరియాలో 140 దాకా బ్రోతల్ హౌస్‌లున్నాయి. 
 
ఒక్కో బ్రోతల్ హౌస్ పిల్లలను తార్చడం ద్వారా ఏటా 24 లక్షల డాలర్లను ఆర్జిస్తోంది. ఈ లెక్కన దేశంలో బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టడం ద్వారా ఏటా 343 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం సాగుతోందని కైలాష్ సత్యర్థి సంస్థ నిర్వహించిన అధ్యయంలో వెలుగు చూసింది. 

గుంటూరులో మైనర్ ప్రేమికుల ఆత్మహత్యాయత్నం!

lovers suicideగుంటూరు, బాపట్లలో నలుగురు మైనర్ ప్రేమికులు సామూహిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ ప్రేమ పెళ్లిళ్లకు కుటుంబ సభ్యులు అంగీకరించన్న భావనతో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో నలుగురు ఒకేసారి పురుగుల మందు సేవించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
బుధవారం చోటు చేసుకున్న సంఘటన వివరాలను పరిశీలిస్తే.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నత కుటుంబాలకు చెందిన యువతులు. వీరు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఖాళీగా ఉంటాడు. బాపట్లకు చెందిన ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆలోచనతో నలుగురూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో నలుగురూ కలిసి పురుగుల మందు తాగారు. వీరిని స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. నలుగుర్నీ బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రత్యూష, దుర్గ పరిస్థితి విషమంగా ఉంది.