Friday 19 September 2014

చిదంబరంకు సీబీఐ సెగ..

యూపీఏ హాయంలో మంత్రిగా వెలిగిన చిదంబరంకు సీబీఐ సెగ తగిలింది. ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ పెట్టుబడుల ఒప్పందం కేసును విచారిస్తున్న సీబీఐ ఆ ఒప్పందంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పాత్రను విచారిస్తోంది. ఆ ఒప్పందంలో 800 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఎలా అనుమతిచ్చారనే దానిపై సీబీఐ పరిశోధన చేపట్టింది. ఈ అక్రమ ఒప్పందంలో మాజీ మంత్రి దయానిధి మారన్‌, ఆయన సోదరుడు కళానిధి మారన్‌ల హస్తం ఉందనీ... దీని వల్ల సన్‌ టీవీ నెట్‌వర్క్‌లోకి భారీగా అక్రమ పెట్టుబడులు ప్రవహించాయనీ సీబీఐ ఆరోపిస్తోంది.
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు..
ఈ పెట్టుబడులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎలా ఆమోదం తెలిపిందన్న దానిపై విచారిస్తున్నామని సీబీఐ ట్రయల్‌ కోర్టుకు వెల్లడించింది. మారిషస్‌కు చెందిన మ్యాక్సిస్‌ సంస్థ సబ్సిడరీ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌... ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో 800 మిలియన్‌ డాలర్లను పెట్టాలని భావించింది. నాటి ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరానికి కేవలం 600 మిలియన్‌ డాలర్ల వరకూ మాత్రమే ఆమోదం తెలిపే అధికారం ఉంది. అంతకు మించితే దానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే తన పరిధిలో లేకున్నా ఈ ఒప్పందానికి మాత్రం చిదంబరమే ఆమోదం తెలిపారు. చిదంబరం ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై విచారిస్తున్నట్లు సీబీఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
742 కోట్ల మేర లబ్ధి పొందిన మారన్‌ సోదరులు..
ఎయిర్‌సెల్‌ను బలవంతంగా ఆనంద కృష్ణన్‌కు చెందిన మ్యాక్సిస్‌ సంస్థకు విక్రయించడంలో మారన్‌ సోదరుల హస్తం ఉందనీ... ఈ వ్యవహారంలో వారు 742 కోట్ల మేర లబ్ధి పొందారనీ సీబీఐ ఆరోపిస్తోంది. తన పరిమితికి మించిన పెట్టుబడులను చిదంబరం ఆమోదించడం చూస్తే... మారన్‌ సోదరులకు చిదంబరం సహకరించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

No comments:

Post a Comment