Tuesday, 16 September 2014

రోడ్ టాక్స్ మాఫీ ఎక్కడ ? ఆటోడ్రైవర్ల అగచాట్లు..

ఆటో డ్రైవర్లకు రోడ్ టాక్స్ మాఫీ చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి ఎంతో మంది ఆటో వాలాలు సంతోషించారు. కానీ వాస్తవ రూపంలో ఆ హామీ ఉత్తితిదే అని తేలిపోయింది. టాక్స్ మాఫీ అవుతుందనే ఉద్ధేశ్యంతో రోడ్ ట్యాక్స్ చెల్లించలేదని..దీనితో ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని పీడించుకతింటున్నారని ఆటోవాలాలు పేర్కొంటున్నారు. 
నగరంలో సుమారు లక్ష ఆటోలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు రోడ్ టాక్స్ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ఇంకా దాన్ని అమలులోకి తేలేదు. ఈ విషయం తెలియక ప్రభుత్వం మాటలు నమ్మి టాక్స్ మాఫీ అవుతుందనే ఉద్దేశంతో రోడ్ టాక్స్ ను చెల్లించకుండా ఉండిపోతున్నారు ఆటోడ్రైవర్లు.  ట్రాఫిక్ పోలీసులు మాత్రం టాక్స్ చెల్లించని ఆటోవాలాలకు ఫైన్లు విధిస్తున్నారు. 
జీవో వచ్చేవరకు మాఫీ లేదు : అధికారులు..
ఆటో ఫిట్‌నెస్ కావాలన్నా, రోడ్డు టాక్స్ కట్టాల్సిందేనని ఆర్టీఏ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. జీ.వో. వచ్చేంత వరకు మాఫీ లేదంటున్నారు. రెండు లేదా మూడు నెలల టాక్సీ అయినా చెల్లించాలని ఆటో డ్రైవర్స్ కు సూచిస్తున్నారు. దీంతో మూడు నెలలకు 150 రూపాయలు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. 
ఆటోడ్రైవర్ల వేడుకోలు..
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు రోడ్డు టాక్స్ విషయంలో దయ చూపించాలని వేడుకుంటున్నారు. అసెంబ్లీలో ఆటోవాలాల ఆశలు చిగురించేలా ప్రకటన చేసిన కేసిఆర్, బడ్జెట్ సమావేశాల్లోనైనా తన వాగ్దానం నిలుపుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. మరి ఆటోవాలాల సమస్యలను కేసీఆర్ పట్టించుకుంటారా ? లేదా ? వేచి చూడాలి.

No comments:

Post a Comment