Tuesday, 16 September 2014

నందిగామలో తెదేపా రికార్డు

విజయవాడ, సెప్టెంబర్ 16: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించింది. రెండోదఫా ఎన్నికై ప్రమాణ స్వీకారానికి ముందే తెదేపా అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ప్రభాకర రావు కుమార్తె సౌమ్య రికార్డుస్థాయిలో విజయం సాధించారు. కృష్ణాజిల్లాలో వేర్వేరు కారణాలతో ఇప్పటివరకు జరిగిన 16 ఉప ఎన్నికల్లో సౌమ్య సాధించిన మెజార్టీదే రికార్డు.
తెదేపా సీనియర్ నేత, అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అకాల మరణంతో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో బ్రాహ్మణయ్య తనయుడు శ్రీహరిప్రసాద్ 61.644 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నందిగామ ఉప ఎన్నికలో సౌమ్య 74.827 వేల ఓట్ల ఆధిక్యతతో ఆ రికార్డును అధిగమించారు. ఈ ఉప ఎన్నికలో వైకాపా పోటీ నుంచి వైదొలిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వేల్పుల పరమేశ్వరరావుకు కేవలం 1800 ఓట్లురాగా, ఈ దఫా కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థిని మార్చి బోడపాటి బాబూరావును బరిలోకి దించడమే కాక, పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర సీనియర్లు విస్తృత ప్రచారం చేశారు. గెలుపు ప్రాధాన్యత కాదని, ఎన్నికల హామీల ఉల్లంఘన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పోటీ చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆమేరకు ప్రచారం కూడా చేసారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదంటూ ఎన్నికను ఓ సవాల్‌గా తీసుకున్న ఆ ప్రాంతానికి చెందిన మంత్రి దేవినేని ఉమ విస్తృత ప్రచారం చేసినా, కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు 24 వేల 921 ఓట్లు దిక్కించుకున్నారు. తెదేపా ఘన విజయంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబాబు 100 రోజుల పాలనకు ఈ తీర్పు అద్దం పట్టగలదని మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై ఎన్ని దుష్ప్రచారాలు సాగించినా ప్రజలు విశ్వసించలేదన్నారు.
చిత్రం.. నందిగామ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తంగిరాల సౌమ్యకు ధృవీకరణ పత్రం అందిస్తున్న అధికారులు

No comments:

Post a Comment