అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు తీరని ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ వీబీ గాడ్గిల్ తెలంగాణ ప్రభుత్వానికి 20 పేజీల సుదీర్ఘ లేఖను రాసింది. ఇందులో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టింది.
రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ఒప్పందం, ఆ తరువాత తలెత్తిన పరిణామాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన పలు లేఖల గురించి ప్రస్తావించారు. ‘‘మారిన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మెట్రో రైలు మనుగడ అనుమానంగానే ఉంది’’ అంటూ తాజా లేఖలో రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు.
ఇంత భారీ ప్రాజెక్టును కేవలం ప్రయాణికులకు టికెట్లు విక్రయించి నిర్వహించలేమని చేతులెత్తేశారు. రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయిందని, హైదరాబాద్ నగరానికి ఇంతకుముందు ఉన్నన్ని అవకాశాలు ఇప్పుడు లేవని అందులో పేర్కొన్నారు. అందువల్ల మీ ప్రాజెక్టును మీరే నిర్వహించుకోండంటూ అందులో తేటతెల్లం చేశారు.
పైపెచ్చు.. తాము ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారాలు చూపించడం మాట అటుంచి... తమపై ఆరోపణలు చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మావైపు నుంచి ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఈ లేఖ రాస్తున్నాం. దీనిపై చర్చలకు మేము సిద్ధమే. అందరం కలిసి కూర్చుని, చర్చించుకుని, ఓ సామరస్యపూర్వకమైన పరిష్కారానికి వద్దాం’’ అని గాడ్గిల్ తన లేఖలో చివరి అవకాశం ఇచ్చారు.
No comments:
Post a Comment