Friday, 12 September 2014

తాడిపత్రి రుచి చూడండి: అన్న క్యాంటీన్లు అవసరమా? జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతపై అసంతృప్తో, లేక నిజంగానే ఫీల్ అయ్యారో కాని తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా అన్న క్యాంటీన్లపై జేసీ వ్యాఖ్యానించడం విశేషం.  
 
బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఏమిటో అర్థం కావడం లేదని జేసీ అన్నారు. 
 
తమిళనాడు అన్నాన్ని టేస్ట్ చేసి పథకం అమలు చేయడం ఏమిటని, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొన్ని పథకాలు అర్థం కావడం లేదని జేసీ వ్యాఖ్యానించారు. అందులో ‘అన్న’ క్యాంటీన్లు ఒకటన్నారు.
 
తాము 2007 నుంచి తాడిపత్రిలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నామని, ఒకసారి తాడిపత్రికి వచ్చి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని టేస్ట్ చేసి చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందని జేసీ తెలిపారు. 
 
కాగా అనంతపురం జిల్లాలో పరిటాల, జెసి వర్గాలకు మధ్య ఎప్పటి నుంచో తీవ్ర వైరం ఉంది. అయితే రాజకీయ అవసరాల కోసం గత ఎన్నికలలో కలిశారు. ఇప్పుడు పరిటాల సునీత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్న క్యాంటిన్లపై జేసీ విమర్శలు గుప్పించడం గమనార్హం. అన్న క్యాంటీన్లతో ఉపయోగమేముంది? అన్న క్యాంటీన్లు అవసరమేనా అంటూ జేసీ ప్రశ్నించారు. 

No comments:

Post a Comment