Thursday, 11 September 2014

నేటితో ముగియనున్నమెదక్ఉపఎన్నిక ప్రచారం

మెదక్ లోకసభ ఉప ఎన్నిక ప్రచారం వాడిగా వేడిగా, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ నెల 13వ తేదీన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా మూడు ముఖ్యమైన పార్టీల మద్య రసవత్తరమైన పోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణాలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీల మద్య తీవ్రమైన పోటీ నెలకొంది. పార్టీల వ్యక్తిగత ప్రతిష్టగా బావించిన మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేసాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను సైతం ప్రచార భరిలోకి దింపాయి.
ఒక పార్టీపై మరో పార్టీ విమర్శనాస్త్రాలు సందించుకుని ఓటర్లను తమవైపు మళ్లించుకునే ప్రయత్నం చేసాయి. చివరి రోజైన గురువారం నాడు కూడా ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించి ముగించనున్నాయి. సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా పార్టీల నేతలకు సూచించారు. సాయంత్రం తరువాత నియోజకవర్గ యేతర నేతలంతా వెళ్లిపోవాలని ఆయన వెల్లడించారు. బుధవారం నాడు నర్సాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణాభివృద్ధికి సహకరిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో జనం తరలివచ్చి సభను విజయవంతం చేయడంతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. మొత్తంమీద పక్షం రోజులుగా ఉత్కంఠమైన వాతావరణంలో కొనసాగిన ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడనుంది.
సాయంత్రం 6 గంటల్లోగా ప్రచారం ముగించాలి
కలెక్టర్ రాహుల్ బొజ్జా
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 10: మెదక్ లోకసభ ఉప ఎన్నిక ప్రచారాన్ని గురువారం సాయంత్రం 6 గంటలలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. 13న జరుగనున్న ఈ ఉప ఎన్నికకు 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచార పర్వాన్ని ముగించాలని ఆయన సూచించారు. నియోజకవర్గం నుంచి కాకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఉప ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సిందిగా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రచారాన్ని గురువారం సాయంత్రం నుంచి నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య, కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన దుకాణాలు, సంస్థలు, కర్మాగారాల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
కెసిఆర్ హామీలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం
పిసిసి మాజీ చీఫ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్
రామాయంపేట రూరల్, సెప్టెంబర్ 10: కెసిఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి అమలు చేస్తే రాజకీయాలు వదులుకుంటానని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సవాల్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దామరచెర్వు గ్రామంలో మెదక్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ తనపై తనకు విశ్వాసం లేక ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. కెసిఆర్‌కు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమానే ఉంటే ఎమ్మెల్యే, ఎంపిగా రెండు చోట్ల ఎందుకు పోటీచేశారని ప్రశ్నించారు.
ఎలాంటి షరతులు లేవు
రుణ మాఫీపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
నర్సాపూర్,సెప్టెంబర్ 10: ఎలాంటి షరతులు లేకుండా రుణ మాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారంనాడు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేకర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపిలు కడియం శ్రీహరి, కేశవరావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబుమోహన్, బాలకిషన్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని 39వేల మంది రైతులకు 18వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే రుణ మాఫీపై గ్రామాలకు లిస్టులు పంపించనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో 4లక్షల మంది రైతులకు 2కోట్ల 70లక్షల రూపాయలు మాఫీ కానున్నాయని అన్నారు. ప్రతి కుటుంబంలో పెళ్లి అయిన కొడుకులు ఉంటే వారికి సైతం రుణ మాఫీ వర్తిస్తుందని రుణ మాఫీపై ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదని అన్నారు. అదేవిధంగా 5సంవత్సరాల నుంచి విడుదల చేయని 480 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీని విడుదల చేసినట్టు చెప్పారు. బిజెపి, కాంగ్రెస్‌లకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి మాట్లాడుతూ వంద రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకోవడం జరిగిందని అన్నారు.
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌తో పాటు కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటిసి సభ్యులు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సాపూర్: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా బుధవారంనాడు నర్సాపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సూమారు నాలుగు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలైన సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలిరావడంతో నర్సాపూర్ పట్టణం జనసంద్రమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సభా స్థలికి చేరుకోకముందే ప్రజలు తమకు కేటాయించిన గ్యాలరీల్లో నిండిపోయారు. విశేషంగా జనం తరలిరావడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్తంభించి పోయంది. కెసిఆర్ ప్రసంగం సాగినంత సేపు అభిమానులు ఈలలు వేస్తు కేరింతలు కొట్టారు. కెసిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నాగలి, నాయకుడు మురళీయాదవ్ గొంగళి కప్పి మేకను బహూకరించారు.
ఒక్కపనీ చేయని ప్రభుత్వం
నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
మెదక్, సెప్టెంబర్ 10: మెదక్ సెగ్మెంట్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి మెజార్టీ ఓట్లు సాధిస్తారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పట్టణం నవాబ్‌పేటలో బుధవారం నాడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మెదక్ జిల్లా టీడీపి మాజీ అధ్యక్షుడు బట్టి జగపతి, మెదక్ పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎండి.అఫ్జల్, మెదక్ పట్టణ బిజెపి అధ్యక్షుడు గోదల కృష్ణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి వంద రోజులు నిండాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో మాత్రం 120 కల్లు దుకాణాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెరిపించారని విమర్శించారు. మెదక్ అభివృద్ధి కావాలన్నా, రైల్వేలైన్ రావాలన్నా, మంజీర నీరు తాగాలన్నా, 24 గంటలు కరెంట్ రావాలన్నా దుబ్బాక నుండి మెదక్ పట్టణానికి రైల్వేలైన్ రావాలన్నా బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి జగ్గారెగెలిపించాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రజలను కోరారు. మెదక్ పట్టణం నవాబ్‌పేటలో బుధవారం జరిగిన జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మెదక్ జిల్లా టిడిపి మాజీ అధ్యక్షుడు బట్టి జగపతి ఆధ్వర్యంలో గాజుల మహేశ్ తన అనుచరులు సుమారు 300 మందితో టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, బట్టి జగపతి టిడిపి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీ ముత్యంగౌడ్, జ్యోతికృష్ణ, గోపాల్, గోదల కృష్ణ, ఎండి.అఫ్జల్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment