Saturday, 13 September 2014

బ్రహ్మాండంగా బతుకమ్మ: సోనియాకు నో ఆహ్వానం.. కేసీఆర్‌పై గుర్రు!

తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. మైసూర్‌లో దసరా ఉత్సవాలను తలపించేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు గాను రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ సంస్కృతికి దర్పణమైన ఈ పండుగకు అతిథులుగా మహిళా ముఖ్యమంత్రులు జయలలిత, వసుంధరరాజే, ఆనందీబెన్‌, మమతాబెనర్జీతో పాటు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మహిళా మంత్రులు, మహిళా గవర్నర్‌లు, కిరణ్‌బేడీ లాంటి ప్రముఖులు, మేధాపాట్కర్‌ లాంటి ఉద్యమకారులు, అరుంధతీరాయ్‌ వంటి రచయితలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.

విదేశీ ప్రముఖురాలిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తామని, వీరందరితో స్వయంగా తానే మాట్లాడుతానన్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా దేశమంతటి దృష్టిని ఆకర్షించే విధంగా పండుగ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అయితే బతుకమ్మ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించకపోవడంపై టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌పై మండిపడుతున్నారు. సోనియా పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని...కనీసం ఆ కృతజ్ఞత కూడా కేసీఆర్‌కు లేదన్నారు.

గతంలో సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని... ఆమె దేవత అని ప్రశంసల వర్షం కురిపించిన కేసీఆర్... ఇప్పుడు ఆమెను కనీసం బతుకమ్మ వేడుకలకు పిలవకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణకు మద్దతు తెలపని మహిళా ముఖ్యమంత్రులను, ఎంపీలను కూడా కేసీఆర్ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారని... ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసిన సోనియాను మాత్రం ఆయన ఆహ్వానించలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన చెందారు.

No comments:

Post a Comment