- మేడ్చల్, సెప్టెంబర్ 12: మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్‌లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డిసిపి ఎ.ఆర్. శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మెదక్ ఉప ఎన్నిక కోసం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రెండు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో మేడ్చల్, శామీర్‌పేట, జడ్‌టిఎఫ్ పోలీసులు మురహరిపల్లి పరిధిలోని రాజీవ్హ్రదారి పక్కనున్న హనీబర్గ్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. రిసార్ట్‌తోపాటు ఆవరణలోని వాహనాలన్నింటిని పోలీసులు సోదాలు చేయగా (ఎపి 23 ఎన్ 6699) నెంబర్ ఇన్నోవాలో వాహనానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ఇన్నోవా అద్దాలు పగలగొట్టి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో 24 లక్షల పది వేల నగదు లభ్యమైంది. వాహనం ఎల్.విష్ణువర్ధన్‌రెడ్డి పేరుపై నమోదై వుంది. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నట్లు డిసిపి తెలిపారు. స్వాధీన నగదును ఆదాయశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఇన్నోవాలో నగదుతోపాటు, మెదక్ ఎంపి బిజెపి అభ్యర్ధి జగ్గారెడ్డికి సంబంధించిన బ్యాలెట్ నమూనా పత్రాలు, బిజెపి-టిడిపి కండువాలు లభించాయి. దీంతో నగదు ఈ పార్టీలకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. మెదక్ శివారు కావడంతో ఈ ప్రాంతాన్ని డబ్బు పంపిణీ చేయడానికి అనువుగా వుంటుందని నేతలు ఎంచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇదే రిసార్ట్స్‌లో వున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కూడా పోలీసులు విచారించారు. సుమారు మూడు గంటలపాటు ఎమ్మెల్యేను ఘటనా స్థలంలోనే కూర్చోబెట్టారు. చివరకు నగదు లభించిన వాహనంకు, ఎమ్మెల్యేకు సంబంధం లేదని తేలడంతో వదిలివేసారు. వాహనంలో లభించిన నగదు టిడిపి-బిజెపిలకు చెందినదిగా స్పష్టమవడంతో ఎమ్మెల్యే కూడా టిడిపికి చెందినవారు కావడంతో ఏదైనా సంబంధం వుందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు డిసిపి వివరించారు. అనంతరం పోలీసులు రిసార్ట్‌లో అణువణువునూ తనిఖీ చేసారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డిని విచారిస్తున్న ఏసిపి శ్రీనివాస్
No comments:
Post a Comment