Friday, 12 September 2014

బ్రహ్మాండంగా ‘బతుకమ్మ’ పండుగ

మైసూర్‌ దసరా వేడుకలను తలపించేలా ఉత్సవాలు
మహిళా గవర్నర్లు, సీఎంలు, కేంద్ర మంత్రులకు ఆహ్వానం

అతిథిగా ప్రముఖ విదేశీ మహిళ.. ఏర్పాట్లకు 10 కోట్లు: కేసీఆర్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 : తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. మైసూర్‌లో దసరా ఉత్సవాలను తలపించేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు గాను రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పండుగ ఏర్పాట్లపై సీఎం శుక్రవారం సచివాలయంలో సమీ క్షించారు.
తెలంగాణ సంస్కృతికి దర్పణమైన ఈ పండుగకు అతిథులుగా మహిళా ముఖ్యమంత్రులు జయలలిత, వసుంధరరాజే, ఆనందీబెన్‌, మమతాబెనర్జీతో పాటు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మహిళా మంత్రు లు, మహిళా గవర్నర్‌లు, కిరణ్‌బేడీ లాంటి ప్రముఖులు, మేధాపాట్కర్‌ లాంటి ఉద్యమకారులు, అరుంధతీరాయ్‌ వంటి రచయితలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. విదేశీ ప్రముఖురాలిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తామని, వీరందరితో స్వయంగా తానే మాట్లాడుతానన్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నం గా దేశమంతటి దృష్టిని ఆకర్షించే విధంగా పండుగ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌కు..
నగరంలోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే వేడుకల కోసం ఎల్బీ స్టేడియంలో దాదాపు 10 వేల బతుకమ్మలను ప్రభుత్వ సహకారంతో పేరుస్తారు. అందుకు కావాల్సిన గునుడు, తంగేడు పూలను కూడా ప్ర భుత్వమే తెప్పించనుంది. సుమారు 25 వేల మంది మహిళలు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌పైకి ఊరేగింపుగా వస్తారని కేసీఆర్‌ ఆకాంక్షించారు. భారీ వేదికపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు ఆసీనులవుతారు. అక్కడే మహిళలు బతుకమ్మ ఆ డుతారు.
బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజుల పాటు హైదరాబాద్‌ నగరాన్ని, ట్యాంక్‌బండ్‌ను, హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలను శోభాయమానంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. అలాగే.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత ప్రాతిపదికన నెక్లెస్‌రోడ్డులో బతుకమ్మ స్క్వేర్‌ నిర్మించాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ పండుగ గొప్పగా జరగాలని, ఇందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. 
ఘనంగా నిర్వహిస్తాం: ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో తొలిసా రిగా జరగనున్న బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహిస్తామని నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణ విషయమై సీఎం కేసీఆర్‌తో శుక్రవారం సచివాలయంలో చర్చించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్ళుగా బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహిస్తున్న ‘జాగృతి’ సంస్థను ప్ర భుత్వం ఆహ్వానించిందని, ఈక్రమంలో.. తమ పాటలు, సాహిత్యం, బతుకమ్మపై చేసిన పరిశోధనా పత్రాలను ప్రభుత్వానికి అం దించామని చెప్పారు 
సోనియమ్మ లేకుండా ‘బతుకమ్మా’!
కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మహిళా నేతలు ఫైర్‌

తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ప్రభుత్వం ఆహ్వా నించకపోవడంపై ఆ పార్టీ మహిళా నేతలు విరుచుకుపడ్డారు. సోనియా పట్టుదల వల్లనే తెలంగాణ వచ్చిందని, అలాంటి నాయకురాలిని ఆహ్వానించకుండా పండుగ చేయడాన్ని సునీతాలక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పద్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు.

No comments:

Post a Comment