Thursday, 11 September 2014

2జీ: సాక్ష్యాల నమోదు.. దయానిధి మారన్ ఒత్తిడి చేశారన్న సీబీఐ

దేశాన్నే కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కీలకదశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మరో 15 మందిపై 3ఏళ్ల క్రిందట విచారణను ప్రారంభించిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు బుధవారం వారి తరపు సాక్ష్యాలను నమోదు చేసుకుంది.
 
2జీ కుంభకోణంలో దయానిధి మారన్ పాత్రపై సీబీఐ కోర్టుకు వివరించింది. మాక్సిస్ గ్రూప్‌‌నకు కంపెనీల విక్రయంలో దయానిధి మారన్ ఒత్తిడి చేశారని సీబీఐ వెల్లడించింది. చెన్నైకు చెందిన సి. శివశంకర్‌ను దయానిధి ఒత్తిడి చేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది.
 
కాగా, ఈ కేసు తుది వాదనలను నవంబర్ 10న వింటామని 2జీ కుంభకోణం కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపడుతున్న సీబీఐ ప్రత్యేక జడ్జి ఒపి. షైనీ తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎస్సార్ గ్రూప్, లూప్ టెలికం ప్రమోటర్లతో పాటు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసు, ఎయిర్ సెల్ - మాక్సిస్ కంపెనీల వివాదాస్పద ఒప్పందంపై తుది వాదనను ఆరోజు వింటామన్నారు.
 
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సాక్షులుగా ఈడీ డిప్యూటీ డెరెక్టర్ రాజేశ్వర్ సింగ్ సహా పలువురికి సమన్లు జారీ చేసేందుకు అనుమతించాలన్న సీబీఐ విజ్ఞప్తిని జడ్జి గురువారం పరిశీలిస్తామన్నారు. సీబీఐ 153 మంది సాక్షులను ఎగ్జామిన్ చేయగా నిందితులు తమ తరపున 29 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.

No comments:

Post a Comment