తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పితృ సమానులని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య వివరణ ఇచ్చారు. వరంగల్‌లో కేసీఆర్ తనతో మాట్లాడిన తీరు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం మీడియాలో వివరణ ఇచ్చారు.
‘కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఒకవేళ నేను ఏమైనా పొరపాట్లు చేస్తే నన్ను మందలించడానికి ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి. హడావిడి ప్రకటనలు చేయవద్దని ఆయన నాకు చెప్పడం ఎంతమాత్రం తప్పుకాదు. ఒక తండ్రిలాగా ఆయన నాకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరంగల్‌లో కేసీఆర్ మాట్లాడిన తీరును కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ దళిత పక్షపాతి. నాకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షే’ అని రాజయ్య వివరణ ఇచ్చారు.
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళిత వర్గానికి చెందిన రాజయ్యను ఇంటికి సాగనంపేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పొగబెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరంగల్ వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి రాజయ్యను సీఎం కేసీఆర్ బహిరంగంగానే మందలించారు. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉండటం వల్లే కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ దఫా జరిగే మంత్రివర్గ విస్తరణలో రాజయ్యకు ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం రాజయ్య స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తండ్రి లాంటి వాడని, కొడుకునని భావించే తనను కేసీఆర్ మందలించారని తనకు తాను ఓదార్పు చెప్పుకున్నారు. కొందరు తనపై తుపాకీ పెట్టి కేసీఆర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాల మాదిరిగా ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవద్దన్నదే కేసీఆర్ అసలు ఉద్దేశమని రాజయ్య వివరణ ఇచ్చారు. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలపై మనసు చలించిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి మందకృష్ణ కలిసిరాలేదని, స్వార్థపూరిత రాజకీయాలతో ఆయన మాట్లాడుతున్నారని రాజయ్య మండిపడ్డారు.
ఒక తండ్రిలాగే సీఎం చంద్రశేఖర్ రావు తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. వరంగల్ సంఘటనను కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దళిత పక్షపాతి అని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే, అది ఆయన పెట్టిన భిక్షేనని రాజయ్య అన్నారు.
No comments:
Post a Comment