ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించే ప్రాంతంగా విజయవాడ పరిసర ప్రాంతాలను ఎంపిక చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆర్థిక శాస్త్ర విద్యార్థినని అందువల్ల తనకు ఇతరులు పాఠాలు చెప్పనక్కర్లేదన్నారు.
ఇకపోతే పంటరుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు, బంగారంపై పంట రుణాలు మాఫీ చేస్తానని చెప్పానని, వాటిని చేస్తామన్నారు. రుణమాఫీని తాను చేసి చూపిస్తానని చంద్రబాబు సభలో బల్లగుద్దినట్లు మరీ నొక్కి చెప్పారు. తాను ఓ రైతు బిడ్డనని, రైతు కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. మీరు చెబితే నేర్చుకోవాల్సిన స్థితిలో తాను లేనన్నారు. రుణమాఫీ తాను దృఢసంకల్పంతో తీసుకున్నానని, అంతేకాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తానని చెప్పారు.
వెంకటేశ్వర స్వామి పవర్‌ఫుల్ గాడ్ అన్నారు. ఆయనకు హాని తలపెట్టిన వారు ఎవరు కూడా బాగుపడలేదని చంద్రబాబు సభలో వ్యాఖ్యానించారు. తిరుపతి అభివృద్ధికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానం వల్లనే అన్నారు. అలాగే కడప దర్గాకు దేశమంతా వస్తారన్నారు. వీటిని ఉపయోగించుకుందామన్నారు. టూరిజానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయన్నారు. టూరిజం అభివృద్ధి జరగాలంటే శాంతిభద్రతలు ముఖ్యమన్నారు. అందుకోసం ప్రతి ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు.
ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్లు వేస్తామన్నారు. ఐదు గ్రిడ్ల ద్వారా రోడ్లు, కరెంట్, విద్యుత్, గ్యాస్, పైబర్ కనెక్టివిటీ చేస్తామన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. నీరు, చెట్టు కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామన్నారు. కరవు నివారణ చర్యలు చేపడతామన్నారు. తాను చెప్పినవన్నీ చేసి చూపిస్తానని చెప్పారు. పరిశ్రమల కోసం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. 14 పోర్టులను డెవలప్ చేయాలని చూస్తున్నామన్నారు.
No comments:
Post a Comment