Saturday, 13 September 2014

మెదక్ ఉప ఎన్నిక.. ఎన్నికల బహిష్కరణ.. ఈవీఎంల మొరాయింపు

సంగారెడ్డి: మెదక్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటి వరకూ మెదక్‌లో 15 శాతం పోలింగ్‌ నమోదైంది. మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పలు చోట్ల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఈవీఎంలు మోరాయించాయి. 
ఓటేసిన ప్రత్యర్థులు...
దుబ్బాక మండలం పోతారంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, శివ్వంపేట మండలం గోమారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డిలో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్‌ ఉప ఎన్నికకు సాగుతున్న ఎలక్షన్‌లో కొన్నిచోట్ల పోలింగ్‌ సరళి మందకొడిగా కనిపిస్తోంది. సిద్ధిపేటలోని భరత్‌నగర్‌, మార్కెట్‌ యార్డులలో ఈవీఎంలు మొరాయిండంతో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు.
గంగాపూర్‌లో ఎన్నికలు బహిష్కరణ
వెల్దుర్తి మండలం పెద్దాపూర్‌లో రోడ్ల నిర్మాణం చేపట్టలేదని గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. తుప్రాన్‌ మండలం కూచారంలో రైల్వే గేటు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ములుగు మండలం గంగాపూర్‌లో ఓటింగ్‌ వేయకుండా.. గ్రామస్తులు నిరసన చేపట్టారు. అధికారులు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయలేదని, అందుకే తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈవీఎంల మోరాయింపు
జిన్నారం మండలం జంగంపేట, రామాయంపేట మండలం ఝూన్సీలింగాపూర్‌లోనూ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది. తర్వాత కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్‌లో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. చిన్న శంకరంపేట మండలం చందాపూర్‌లో ఈవీఎం మొరాయించడంతో కాసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. గజ్వేల్‌ మండలం బంగ్లా వెంకటాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో పరిమితి లైన్‌ దాటివచ్చిన ఓటర్లపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు.

No comments:

Post a Comment