Saturday, 13 September 2014

బడ్జెట్‌ తయారీలో టి.సర్కార్‌కు ఊహించని పరిణామాలు

హైదరాబాద్: బడ్జెట్‌ తయారీ ఆగమేఘాల మీద చేద్దామనుకున్న తెలంగాణ సర్కార్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. రూపకల్పన కోసం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీలు సమగ్ర నివేదికలు తయారు చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రకటనలు.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేసినా.. బడ్జెట్‌ అంచనాలపై మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. విధానాలకు తగ్గట్టుగా నిబంధనలపై క్లారిటీ లేకపోవడం.. కొన్ని పథకాల్లో లబ్దిదారులపై సరైన అంచనాలు లేకపోవడంతో బడ్జెట్‌ అంచనాలు వేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్‌ 5 లోపు శాఖల వారిగా నివేదికలు
సెప్టెంబర్‌ 5 లోపు శాఖల వారిగా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ 14 టాస్క్ ఫోర్స్ కమీటీలను ఆదేశించారు. అయితే డెడ్ లైన్ లోపు నివేదికలు పూర్తి కాకపోవడంతో... మరో ఐదు రోజుల గడువు పెంచింది ప్రభుత్వం. దీనిపై సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించింది. చర్చిండానికి అవసరమైన నివేదికలే రాకపోవడంతో సీఎస్‌ షాక్‌ తిన్నారు.
కొత్త పథకాలపై కొరవడిన స్పష్టత
ఫాస్ట్ పథకం.. స్థానికత నిబంధన వంటివాటిపై ఇప్పటికి క్లారిటీ లేకపోవడంతో.. బడ్జెట్‌ అంచనా వేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీని మారుస్తామన్నారే గాని.. ఎలా మారుస్తారనే క్లారిటీ ఇవ్వలేదు. రుణమాఫీ నిర్ణయాల్లో ఆటుపోట్లు వస్తుండటంతో అయోమయం ఏర్పడింది. డబుల్‌బెడ్‌రూమ్‌ ప్లాట్స్‌ పథకం విషయంలో లబ్దిదారుల అర్హతలో స్పష్టత లేదు.
ఈ నెల 30 వరకు గడువిచ్చిన ప్రభుత్వం
చేసేదేమీ లేక ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీలకు ఈ నెల 30 వరకు గడువిచ్చింది. ఈలోపు వాటికి అవసరమైన స్పష్టత కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సరికొత్త బడ్జెట్‌ను.. కేసీఆర్‌ తనదైన పంథాలో చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతమేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment