Saturday, 13 September 2014

ప్రశాంతంగా పోలింగ్ - భన్వర్ లాల్..

హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్‌ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత ఎన్నికల్లో కన్నా ఈసారి పోలింగ్‌ సరళి తగ్గింది. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో పోలింగ్‌ గణనీయంగా తగ్గిందని, అది మొత్తం ఎంపీ స్థానంపై పడిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. మెదక్‌లో 66శాతం పోలింగ్ జరిగిందని, కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 
ఓటు హక్కు వినియగించుకున్న కేసీఆర్ దంపతులు..
    అంతకు ముందు చింతమడకలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధిపేటలో హరీష్‌రావు దంపతులు ఓటేశారు. కోనాపూర్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోతారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, గోమారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డిలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
నందిగామలో 67.5 శాతం..
    ఇక నందిగామలోనూ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, కాంగ్రెస్‌ అభ్యర్థి బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులు మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా నందిగామలో 67.5 శాతం పోలింగ్‌ జరిగనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
గెలుపుపై రాజకీయ పార్టీల ఆశాభావం..
    ఎవరికి వారుగా అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ రాజకీయపార్టీలు ఆశాభావం వ్యక్తం చేశాయి.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అటు ఎన్నికల యంత్రాంగం, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈవీఎంల్లో భద్రంగా ఉన్న ఓటరు తీర్పు ఏంటో తెలియాలంటే ఈనెల 16 వరకు వేచి చూడాల్సిందే. 

No comments:

Post a Comment