Thursday, 11 September 2014

ఏపీ, తెలంగాణల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం


హైదరాబాద్: ఏపీలోని నందిగామ, తెలంగాణలోని మెదక్‌లో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు ఈ ఉప ఎన్నిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి ఎన్నిక కావడంతో, గత ఎన్నికల్లో కేసీఆర్‌ పొందిన ఆధిక్యత కంటే అత్యధిక మెజార్టీ సాధించాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలన్ని గురువారం నాడు పోటాపోటిగా ప్రచారాన్ని నిర్వహించాయి.
శనివారం ఉదయం 8గంటలకు ఉప ఎన్నికల పోలింగ్....
శనివారం ఉదయం 8గంటల నుంచి ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్నందున,..ప్రధాన పార్టీలన్ని తెరవెనక ప్రచారానికి తెరతీశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగితేలాయి.
చివరి రోజు విస్తృతంగా ప్రచారం...
గురువారం సాయంత్రం 5గంటలకు ప్రచారం గడువు ముగిసిపోవడంతో,.ప్రధాన పార్టీలన్నీ పోటా పోటీగా ప్రచారాన్ని నిర్వహించాయి. దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో చివరి రోజు ధూంధాంగా ప్రచారాన్ని కొనసాగించింది. ప్రచారంలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, పద్మారావులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక గజ్వేల్, సంగారెడ్డిల్లో బీజేపీ బహిరంగ సభలను నిర్వహించింది. ఈ సభలకు కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడతో పాటు,.రాష్ట్ర నేతలు నాగం, కిషన్‌రెడ్డి, దత్రత్రేయతో పాటుపలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విస్తృత ప్రచారం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. అటు కృష్ణాజిల్లా నందిగామలో కూడా పోటీచేసే ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేశాయి. నందిగామ నుంచి టిడిపి తరపున పోటీచేసే తంగిరాల సౌమ్య,..ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఉప ఎన్నిక పోలింగ్ సందర్బంగా,..అన్ని ఏర్పాట్లను పూర్తిచేసే పనిలో పడ్డారు అధికారులు. ఎన్నికల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోస్త్‌ ఏర్పాటు చేస్తున్నారు.
తెరవెనుక ప్రచారానికి రడీ అయిన పార్టీలు...
గురువారంతో తెరముందు ప్రచారం ముగియడంతో,..ఇప్పుడు ఆయా పార్టీలన్ని తెరవెనుక ప్రచారానిక తెరతీశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. తెరవెనుక మద్యం, డబ్బు పంపిణీని చేపట్టేందుకు ఇప్పటికే అన్ని పూర్తయినట్లు సమాచారం. అయితే,..ఓటర్లకు ఎవరైనా డబ్బు, మద్యం పంచేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడినట్లైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఓటర్లకు సూచించారు. 

No comments:

Post a Comment