Thursday, 11 September 2014

పోలవరంపై ముందడుగు!

ఒడిషా, చత్తీస్‌గఢ్‌లతో చర్చలకు బాబు కసరత్తు
వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటన
-------------------------
హైదరాబాద్, సెప్టెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలతో ఆయన చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులతో ముఖాముఖి చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ రాజధానిని కూడా స్వయంగా అధ్యయనం చేసి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అనుసరించాల్సి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని యోచిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇతర రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటించడం ఇదే తొలిసారి కాగా, పోలవరంపై ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలతో చర్చలకు స్వయంగా వెళ్లడం కూడా ఇదే తొలిసారి. కొత్త రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అత్యవసరంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై కేంద్ర జల సంఘంలో ఫిర్యాదులు చేయడంతోపాటు, సుప్రీంకోర్టులోకూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఏళ్ల తరబడి ఆ పిటిషన్లు విచారణ స్థాయిలోనే ఉండడంతో పోలవరం నిర్మాణానికి అడ్డంకిగానే ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందుగా ఛత్తీస్‌గఢ్, ఒడిషా అభ్యంతరాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. పోలవరం నిర్మాణంవల్ల ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, ఒడిషాలో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలను నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు, ఇతర గ్రామాల వద్ద రక్షణ గోడలను నిర్మించేందుకు దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఆ ప్రతిపాదనలకు రెండు సరిహద్దు రాష్ట్రాల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. అందుకే ఈ విషయాలను నేరుగా ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని గ్రామాలకు ఎటువంటి నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హోదాలో స్పష్టమైన హామీనివ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.
ఇలా ఉండగా, తన పర్యటన సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయపూర్‌ను కూడా ముఖ్యమంత్రి అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో ఉన్న రాజధానుల్లో గాంధీనగర్, చండీగఢ్‌తోపాటు నయా రాయపూర్ కూడా బాగుందన్న నివేదికలను శివరామకృష్ణన్ ఇవ్వడం తెలిసిందే. అందుకే రాయపూర్ నిర్మాణం ఎలా జరిగిందన్నది స్వయంగా అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆశక్తి కనపరుస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో స్వయంగా చర్చించాలని ఆయన నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని బాబు భావిస్తున్నారు.
ఇలా ఉండగా, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని పరామర్శించేందుకు శనివారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు.

No comments:

Post a Comment