మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. అయితే, హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రచారం చేయనున్నారు. ఇదే అంశంపై ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ తరపున యువరాజ్ సింగ్ ప్రచారం చేయనున్నాడు. దీనికి సంబంధించిన విధివిధానాలను, వ్యూహాలను యువరాజ్ సింగ్, అమిత్ షాలు చర్చించుకున్నట్టు సమాచారం.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సెగ్మెంట్లకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు సీఈసీ వీఎస్ సంపత్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 20న రెండు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ అని చెప్పారు. అక్టోబర్ 15న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగుతుందని, 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని సంపత్ వివరించారు. 'నోటా' సౌకర్యం తప్పకుండా ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.
No comments:
Post a Comment