Saturday, 13 September 2014

ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఉద్దవ్ ఠాక్రే..

మహారాష్ట్ర : రాష్ట్ర రాజకీయాల్లో వేడి మొదలైంది. బీజేపీ - శివసేన మధ్య సీట్లు సర్దుబాటు కుదరకముందే ముఖ్యమంత్రి పీఠంపై వాదోపవాదాలు మొదలయ్యాయి. నేతల మధ్య అప్పుడే సిగపట్టు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 15న మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీ-శివసేన మధ్య సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది. అయితే ఎవరికెన్ని సీట్లు అనేదానిపై మాత్రం ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లు గెల్చుకున్న తమకు సగం సీట్లు ఇవ్వాలని బీజేపీ వాదిస్తోంది. అయితే మహారాష్ట్ర అధికార పీఠంపై కన్నేసిన సేన మాత్రం అందుకు ససేమిరా అంటోంది.
సీట్లిస్తేనే పొత్తా ?..
తాజాగా... శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పొత్తు విషయంలో బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ సీట్లను ఆశిస్తే విడాకులు తప్పవని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇన్ని సీట్లిస్తేనే పొత్తు కుదుర్చుకుంటామనే వైఖరి తప్పని ఉద్ధవ్‌ అభిప్రాయపడ్డారు. మిత్రపక్షాలకు తక్కువ సీట్లొచ్చినా, ప్రభుత్వంలో వారికీ చోటుంటుందనీ... అయితే ముందు అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలని హితవు పలికారు.
అవకాశమిస్తే నెంబర్‌ వన్ స్థానంలో నిలుపుతా..
మహారాష్ట్ర పీఠంపై మనసు పడ్డానని చెప్పకనే చెప్పిన ఉద్ధవ్‌ ఠాక్రే... బీజేపీకి ఆ అవకాశం దక్కనివ్వనని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. ముంబైలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఉద్ధవ్‌... అవకాశమిస్తే మహారాష్ట్రను దేశంలోనే నెంబర్‌ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కనడం లేదంటూనే... బాధ్యతలు అప్పగిస్తే మాత్రం వాటి నుంచి పారిపోనన్నారు. దేశమంతా మార్పు కావాలనుకుని మోడీకి అధికారం కట్టబెట్టారనీ, అదే విధంగా మహారాష్ట్ర ప్రజలూ మార్పు కోరుకుంటున్నారని ఉద్ధవ్‌ అన్నారు.
సేన-బీజేపీల మధ్య పొత్తు కుదిరేనా?
ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బీజేపీకి తాను కోరుకుంటున్నట్లు సగం సీట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్యా అసలు పొత్తు కుదురుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

No comments:

Post a Comment