Monday 15 September 2014

'సముద్రంలో రెండు ఓడల మునక, 500మంది మృతి

కైరో: మధ్యధరా సముద్రంలో ప్రయాణీకులతో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు ఐదు వందల మందికి పైగా మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మృతులు అందరూ కూడా వలస కూలీలుగా భావిస్తున్నారు. దుండగుల దాడి వల్లనే ఓడ మునిగిపోయి ఉంటుందని తెలుస్తోంది. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) ఈ విషయాన్ని వెల్లడించింది. సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్, సూడాన్ దేశాలకు చెందిన సుమారు 500 మంది వలస కూలీలతో ప్రయాణిస్తున్న రెండు ఓడలు మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు ఐవోఎం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రమాదం నుండి బయటపడిన పాలస్తీనాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఐవోఎం ప్రతినిధుల బృందం ముఖాముఖి నిర్వహించింది. సెప్టెంబర్ 6న ఈజిప్టులోని దిమిత్తా పోర్ట్ నుండి తాము బయలుదేరామని, ఓడలో సుమారు 500 మందికి పైగా ఉన్నట్లు వారు తెలిపారని ఐవోఎం తెలిపింది. ఇటీవల జరిగిన ఓడ ప్రమాదాల్లో ఇవి అతి పెద్ద ప్రమాదాలని ఐవోఎం పేర్కొంది. మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీకి వెళ్లే వలస కూలీల సంఖ్య గత కొంతకాలంగా బాగా పెరిగిందని, గత నెల వరకు 1.08 లక్షల మంది సముద్ర మార్గం ద్వారా ప్రయాణించారని తెలిపింది. అయితే, ఈ ప్రమాదం నుండి ఓ నిండు గర్భిణీతో సహా కొంతమందిని రక్షించినట్లు నావికాదళ కెప్టెన్ చేసిన ప్రకటనను ఓ న్యూస్ వెబ్ సైట్ ప్రచురించింది. బయటపడిన వారిద్దరిని సిసిలీకి తీసుకు వచ్చారు. తొమ్మిది మందిని గ్రీక్, మాల్టీస్ షిప్‌లు రక్షించినట్లుగా చెబుతుననారు.

No comments:

Post a Comment