Friday 19 September 2014

దొంగ కోసం పరిగెడితే.. పండంటి పాప పుట్టింది

న్యూయార్క్: అమెరికాలోని మిచిగాన్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన హ్యాండ్ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని వెళుతున్న దొంగను పట్టుకునేందుకు పరుగెత్తిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఆమె పెట్టిన కేకలు స్థానికుల్లో కదలిక తెచ్చి.. దొంగను పట్టుకునేలా చేశాయి. మిచిగాన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ సిటీలో నిండు గర్భిణీ అయిన ఓ మహిళ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నుక్కుంది. వాటిని కార్లో పెడుతుండగా... ఓ అగంతుకుడు ఆమె భుజానికి తగిలించుకున్న బ్యాగ్‌ను కాజేసి పరుగెత్తడం ప్రారంభించాడు. వెంటనే తేరుకున్న ఆమె పరుగు పెట్టి అతన్ని పట్టుకోబోయింది. దీంతో దొంగ ఆమెను బలంగా నెట్టివేసి పరుగు తీశాడు. ఈ హఠాత్పరిణామంతో, ఆమె గట్టిగా గావు కేకలు వేయడం ప్రారంభించింది. అదేసమయంలో, ఆమెకు నొప్పులు రావడం... పండంటి బిడ్డకు జన్మనివ్వడం నిమిషాల్లో జరిగిపోయాయి. మహిళ అరుపులు విన్న స్థానికులు దొంగను పట్టుకున్నారు. నార్మల్ డెలివరీ అవడంతో పాటు... సిజేరియన్ చేయించుకునే కష్టం తప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. దీంతో పాటు, చేజారిపోయిందనుకున్న పర్స్ మళ్లీ చేతికి అందడం మరింత సంతోషాన్నిస్తోందని ఆమె తెలిపింది. దొంగను స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. అతడ్ని మార్క్ న్యూటన్(30)‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment