Wednesday 17 September 2014

మెట్రో రైలు వివాదంపై కేసీఆర్ వివరణ : సూటిగా చెప్పని గాడ్గిల్

kcrమెట్రో రైలు ప్రాజెక్టుపైన వచ్చిన వివాదాస్పద వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా మెట్రో రైలు పైన కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని ఆయన తరపున ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య లేఖలు అత్యంత సహజమని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.
 
ముఖ్యంగా.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేందుకే మెట్రో పైన వార్తలు రాశాయన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికలు రాస్తున్నాయన్నారు. మెట్రో ప్రాజెక్టు పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండో విడత మెట్రో ప్రాజెక్టును త్వరలోనే చేపడతామన్నారు. ఇదే విషయంపై కేంద్రంతో చర్చించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అవసరమైతే ఢిల్లీ మెట్రో పితామహుడు శ్రీధరన్ సలహా కూడా తీసుకుంటామని చెప్పారు. 
 
అంతకుముందు.. ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ ఎండీ వీబీ గాడ్గిల్ స్పందిస్తూ.. మెట్రో రైల్ నిర్మాణ పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తమేనని అయితే, ఆ లేఖ ఎపుడు రాశామో తెలుసుకుని వార్తా కథనాలు ప్రచురించాలన్నారు. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఆగిపోయే దిశగా ఉన్నాయంటూ పత్రికల కథనాల్లో వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. 
 
మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగుతుందని చెప్పారు. అయితే, ఈ నెల 10న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమేనన్న గాడ్గిల్, అది నేరం కాదన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా ఈ లేఖ రాయడం జరిగిందన్నారు.  
 
ఫిబ్రవరి నుంచి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని చెప్పుకొచ్చిన ఆయన.. ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని పునరుద్ఘాటించారు. సుదీర్ఘకాలం నడిచే పెద్ద ప్రాజెక్టులున్నప్పుడు అవాంతరాలు సహజమని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో గాడ్గిల్ మాట్లాడారు. మెట్రో మార్గంలో మార్పులపై ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు

No comments:

Post a Comment