Wednesday 17 September 2014

కోర్టుకెక్కడం బాధే, కానీ తప్పలేదు‌: మనోజ్ కుమార్

న్యూఢిల్లీ: అర్జున అవార్డును పొందడానికి కోర్టుకెక్కడం తనను బాధించిందని అయితే, న్యాయం కోసం ఆ విధంగా పోరాడక తప్పలేదని బాక్సర్ మనోజ్ కుమార్ అన్నాడు. తన పేరు జాబితాలో చేరినందుకు ఆనందిస్తున్నానని బుధవారం పిటిఐ వార్తాసంస్థతో అన్నాడు. ఈఏడాది అర్జున అవార్డులకు ఎంపిక చేసిన అథ్లెట్ల జాబితాలో మనోజ్ పేరు కనిపించలేదు. వెంటనే అతను ఈ విషయాన్ని అవార్డుల ఎంపిక కమిటీ దృష్టికి తీసుకెళ్లాడు. రివ్యూ 

కోర్టుకెక్కడం బాధే, కానీ తప్పలేదు‌: మనోజ్ కుమార్
సమావేశంలో దీనిని పరిశీలిస్తామని కమిటీ హామీ ఇవ్వడంతో మనోజ్ ఊరట చెందాడు. అయితే, రివ్యూ సమావేశం ముగిసిన తర్వాత కమిటీ విడుదల చేసిన తుది జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో కంగు తిన్నాడు. తన కంటే ఎంతో తక్కువ స్థానంలో ఉన్న జై భగవాన్‌ను ఎంపిక చేసి, తన పేరును పక్కకు తప్పించడం అన్యాయమని పేర్కొంటూ అతను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టినప్పుడు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) వివరణ ఇచ్చాడు. మనోజ్ డోపింగ్ కేసులు పట్టుబడ్డాడని కమిటీ తప్పుగా అభిప్రాయపడిందని చెప్పాడు. ఆ కారణంగానే మనోజ్ పేరును జాబితాలో చేర్చలేదని వివరించాడు. అయితే, మనోజ్ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడలేదని తేలడంతో, ఇప్పుడు అతని పేరును చేరుస్తామని కోర్టుకు హామీ ఇచ్చాడు. కోర్టు ముందు పొరపాటును అంగీకరించడంతో సమస్యకు తెరపడింది. మనోజ్ పేరు అర్జున అవార్డు ప్రతిపాదితుల జాబితాలో చేరింది. అయితే, న్యాయంగా తనకు దక్కాల్సిన గౌరవం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిరావడం దురదృష్టకరమని మనోజ్ వ్యాఖ్యానించాడు. అర్జున అవార్డు దక్కనున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, కోర్టును ఆశ్రయించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందుకు బాధగా ఉందని అన్నాడు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న అతను పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ హైకోర్టులో గెలిచిన తన పేరును అవార్డు ప్రదానికి ఎంపిక చేసిన జాబితాలో చేర్చేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో సమస్యకు తెరపడిందన్నాడు.

No comments:

Post a Comment