ముంబై, సెప్టెంబర్‌ 23 : మహారాష్ట్ర ఎన్నికల కోసం ప్రధాన పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వస్తున్నాయి. శివసేన-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఫలించాయి. బీజేపీకి 130 స్థానాలు ఇవ్వడానికి శివసేన అంగీకరించింది. ఈ ఎన్నికల అంశం తెరమీదకు వచ్చిన నాటి నుంచి బీజేపీ తమకు 135 సీట్లు కావాలని పట్టుపట్టింది. శివసేన మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలలోలాగే 119 సీట్లు ఇస్తామని వాదించింది. 151 స్థానాల్లో తాము స్వయంగా పోటీచేయాలని శివసేన భావించింది.
 
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లలో 145 స్థానాలు సొంతంగా గెలుచుకోగలిగితే ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది శివసేన ఆలోచన. గత రెండు మూడు రోజులుగా శివసేన-బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం బీజేపీ కేంద్ర నాయకత్వం సమావేశమై 130 సీట్లు ఇవ్వాలని శివసేనను కోరింది. ఈ ప్రతిపాదనపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ థాక్రే మంగళవారం మధ్యాహ్నం వరకు మంతనాలు సాగించారు. చివరికి బీజేపీకి 130 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
 
మరోవైపు ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మొత్తం సీట్లలో సగం స్థానాల్లో తాము పోటీ చేస్తామంటూ కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనకు ఎన్సీపీ ఒప్పుకోవడం లేదు. ఆ రెండు పార్టీల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. శరద్‌పవర్‌ నివాసంలో ఎన్సీపీ మంతనాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఇరు పార్టీల నాయకులు మరోసారి సమావేశం కానున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈనెల 27వరకు గడవు ఉంది. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ చర్చల ఫలితాలు కూడా ఈ సాయంత్రం తెలిసే అవకాశం ఉంది.