Friday 19 September 2014

24 గంటల్లో భారీ వర్షాలు..

విశాఖపట్టణం : పశ్చిమ మధ్య బంగాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం ఏర్పడింది. మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా మారే వకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిఫలితంగా రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా..తెలంగాణలోని ఒకటి..రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
స్తంభించిన జనజీవనం..
తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. రాజమండ్రి నగరంలో జనజీవనం స్థంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగర సమీపంలోని కంబాల చెరువు, రైల్వేస్టేషన్‌ రోడ్డు, దేవి చౌక్‌ పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్యపురం, తిలక్‌ రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కోరుకొండ, గోకవరం, సీతానగరం రాజానగరం మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు ఇంకా విస్తారంగా కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సరుకులపాడు, యంద్రాహీ, పెదమద్దూరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అమరావతి నుంచి విజయవాడ, గుంటూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. లామ్‌ సమీపంలో రహదారిపై కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

No comments:

Post a Comment