Friday 19 September 2014

నివ్వెరపోయిన క్షీరపురి .. మూగబోయిన మాండలిన్

పాలకొల్లు, సెప్టెంబర్ 19: బుడతడుగా తన ఒడిలో స్వరార్చన ప్రారంభించి, సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన మాండలిన్ శ్రీనివాస్ అకాల మరణ వార్తతో క్షీరపురి పట్టణం నివ్వెరపోయింది. 1969లో సాధారణ వాద్య కళాకారుడు ఉప్పలపు సత్యనారాయణ (అన్నవరం), కాంతమ్మ దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. కోడుగట్టులో ఉన్న మున్సిపల్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన శ్రీనివాస్ పోడూరుకు చెందిన రుద్రరాజు సుబ్బరాజు వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పాలకొల్లులో అప్పట్లో ప్రసిద్ధిచెందిన ‘సూరి బ్యాండు’లో ఐదేళ్ల ప్రాయంలోనే శ్రీనివాస్ గిటార్ వాయించేవారు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే మాండలిన్‌పై అలవోకగా సప్తస్వరాలను పలికిస్తూ సంగీత స్రష్టలనే ఆశ్చర్యానికి గురిచేశారు. అప్పట్లోనే పాలకొల్లు వచ్చిన సంగీత నిధి మంగళంపల్లి బాలమురళీకృష్ణతో సత్కారం అందుకున్న శ్రీనివాస్ తన గురువు సుబ్బరాజుతో కలిసి చెన్నై చేరుకుని తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత పాలకొల్లుతో పెద్దగా సంబంధం లేకపోయినా ప్రపంచ దేశాల్లో శ్రీనివాస్ పేరు మార్మోగిపోవడంతో క్షీరపురి మురిసిపోయేది. తమిళనాడు ఆస్థాన విద్వాంసునిగా ఎంజిఆర్, జయలలితల ప్రశంసలందుకున్న శ్రీనివాస్ అక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రులు సైతం అక్కడికే వెళ్లిపోవడంతో ప్రస్తుతం పాలకొల్లులో ఆయన బంధువులు కొందరు ఉంటున్నారు. మాండలిన్ శ్రీనివాస్ కాలేయ వ్యాధితో బాధపడుతూ గత కొద్ది రోజులుగా చెన్నైలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు ఇక్కడకు సమాచారం అందింది. శ్రీనివాస్ అకాల మృతిని పాలకొల్లులోని ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. పినతండ్రి పెద్దిరాజు పాలకొల్లులో పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తమవాడు ఎంతో ఎదిగాడని మురిసిపోతుంటామని, పిన్న వయస్సులోనే మృతి చెందడం తట్టుకోలేక పోతున్నామని వాపోయారు.
లలిత కళాంజలి సంతాపం
సంగీత విద్వాంసులు, క్షీరపురి నుండి వెళ్లి పద్మశ్రీ సాధించిన మాండలిన్ శ్రీనివాస్ మృతి సంగీత, కళారంగానికి తీరని లోటని సినీ దర్శకులు, లలిత కళాంజలి నాటక అకాడమీ వ్యవస్థాపకులు కోడి రామృష్ణ సంతాపం తెలిపారు. తమ అకాడమీ ఆయనను సన్మానించిన స్మృతులు జ్ఞప్తికి వస్తున్నాయన్నారు. సంస్థ అధ్యక్షుడు యియ్యపు రామలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఇందుకూరి దిలీప్‌కుమార్‌రాజు, కోశాధికారి కొటికలపూడి కృష్ణ, సహాయ కార్యదర్శులు శీలంశెట్టి సత్యప్రసాద్, తాళాబత్తుల కృష్ణ, కొసనా సత్తిబాబు తదితరులు శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
నేతల సంతాపం
మాండలిన్ శ్రీనివాస్ మృతికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ అంగర రామమోహన్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, డాక్టర్ బాబ్జి, మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్-్ఛర్మన్ రోజారమణి, కౌన్సిలర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ సంతాప సందేశాలు పంపారు. క్షీరపురి గౌరవాన్ని పెంచి, సంగీత సామ్రాజ్యంలో తనదైన బాణీలో కొత్త వరవడి సృష్టించి, ఎందరినో తీర్చిదిద్దిన మహా వ్యక్తి మాండలిన్ శ్రీనివాస్ అని, ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని వారన్నారు.

No comments:

Post a Comment