Thursday 18 September 2014

మీ బలగాల దుందుడుకు చర్యలు నిగ్గు తేల్చాల్సిందే : మోడీ

Narendra Modi Jinpingసరిహద్దుల్లో మీ బలగాల దుందుడుకు చర్యల సంగతి తేల్చాల్సిందేనంటూ భారత్ పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు. సరిహద్దుల్లోకి పదేపదే చొరబడుతున్న చైనా సైనికుల విషయం ఏంటో, ఆ గొడవ ఏంటో మీరు తేల్చాలని ఆయనను కోరారు. భారతదేశంలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడితో ఆయన సుమారు 45 నిమిషాల పాటు మాట్లాడారు. అందులో ప్రధానంగా చొరబాట్ల విషయాన్నే ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 
 
లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖను చైనా సైన్యం తరచూ ఉల్లంఘిస్తోందని మోడీ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను కూడా కట్టుబడి ఉన్నట్లు జిన్ పింగ్ మోడీకి హామీ ఇచ్చారు. సరిహద్దుల వద్ద జరుగుతున్న వ్యవహారంపై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని, ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిందేనని గట్టిగా చెప్పారు. 
 
వాస్తవాధీన రేఖ విషయంలో స్పష్టత వ్యవహారం గతంలో నిలిచిపోయిందని, దాన్ని పునరుద్ధరించాలని కూడా జిన్ పింగ్ కు తెలిపానన్నారు. అప్పుడే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. చైనా-భారత్ సరిహద్దు వ్యవహారం ఇరు దేశాలకు ఇబ్బందిగానే ఉందని,  సరిహద్దు స్పష్టంగా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందని జిన్ పింగ్ చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోడానికి చైనా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 

No comments:

Post a Comment