Friday 19 September 2014

ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కార్ మంగళం..

హైదరాబాద్: గ్రామాల్లో రైతులకు, వ్యవసాయ శాఖాధికారులకు మధ్య సమన్వయకర్తలుగా ఉండి రైతులకు చేయూత అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కారు ఉద్వాసన పలికింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదర్శ రైతు వ్యవస్థలో అవకతవకలు జరిగాయంటూ దాని రద్దు కోసం పోరాడిన టీడీపీ... అధికారంలోకి రాగానే తన పంతం నెగ్గించుకుంది. ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులతో ఆదర్శరైతు పథకం..
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే... స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఆదర్శరైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉద్దేశం మంచిదే. ఐతే ఆదర్శ రైతు ఎంపికలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా ఎంపిక చేస్తున్నారని... అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఆరోపించింది.
ఆదర్శ రైతు రద్దు ఏపీ సర్కారుకు లాభదాయకం..
ఆదర్శ రైతు రద్దు ఏపీ సర్కారుకు లాభదాయకమే కానుంది. ప్రస్తుతం ఏపీలో 39 వేల 804 మంది ఆదర్శరైతులు ఉండగా... ఇందుకోసం ఏటా 60 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అసలే లోటు బడ్డెట్ లో ఉన్న ఏపీకి... ప్రతి పైసా విలువైనది. దీంతో ఈ వ్యవస్థకు మంగళం పాడటం కలిసి వచ్చే అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. 

No comments:

Post a Comment