Sunday 21 September 2014

సుందరయ్య విజ్ఞానం కేంద్రం వద్ద ఉద్రిక్తత, వరవరరావు సహా 100 మంది అరెస్టు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 : రాజకీయ ప్రత్యామ్నాయం పేరుతో విరసం నేతలు తలపెట్టిన సభ ఉధ్రిక్తతకు దారితీసింది. సభ నిర్వహణకు అనుమతి లేదంటూ విరసం నేత వరవరరావు సహా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
 
రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సభ ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని విరసం నేతలు చెబుతుంటే... దీనిని అడ్డుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్నవారినందరిలో కొంతమందిని ఫలక్‌నూమా పీఎస్‌కు, మరికొంతమందిని బొల్లారం పీఎస్‌కు తరలించారు.
 
పదేళ్ల విప్లవోద్యమ పురోగతిపై అఖిల భారత స్థాయిలో.. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక కన్వీనర్‌ వరవరరావు ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సు అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. బొజ్జా తారకం, హరగోపాల్‌, కేఆర్‌ చౌదరి, కంచన్‌ కుమార్‌, అమిత్‌ భట్టాచార్య, రావుణి(కేరళ ప్రతినిధి), జీతన్‌ మరాండీ(జార్ఖండ్‌ సాంస్కృతిక నేత) పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. కాగా, వరవరరావు నిర్వహించే సమావేశం, ర్యాలీకి అనుమతి లేదని మధ్య మండలం ఉపకమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అనేది నిషేధిత సీపీఐ మావోయిస్టు పక్షానికి అనుబంధం. వరవరరావు రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు అధ్యక్షుడు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు కన్వీనర్‌గా ఉండడం, ఆర్‌డిఎఫ్‌పై నిషేధం ఉండడం, పైగా రెండిటికీ వరవరరావే నేతృత్వం వహించడంతో అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు

No comments:

Post a Comment