Monday 22 September 2014

స్పీకర్ ముందుకు మెట్రో ఫైళ్ళు

హైదరాబాద్, సెప్టెంబర్ 21: మెట్రో రైలు ఫైళ్ళను అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలూ పరిశీలించేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పెట్టాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. తాను వాస్తవాలు చెబితే పరువు నష్టం దావా వేస్తామంటున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. గేమింగ్ సిటీ కోసం లోగడ కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. రెండు వేల కోట్ల రూపాయలతో భూములు ఖరీదు చేసినట్లు మైహోం రామేశ్వర రావు చెప్పారని ఆయన గుర్తు చేశారు. రామేశ్వర రావుకు మద్దతుగా సిఎం కిరణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమం వద్ద టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, డిఎల్‌ఎఫ్ కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గేమింగ్ సిటీ భూములను ఇతరులకు ఇచ్చే అవకాశం లేదని చెప్పిన ఎపిఐఐసి చైర్మన్ రంజన్ ఎవరి వత్తిడి వల్ల దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. తమ భూములు గేమింగ్ సిటీకి ఇస్తే మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్‌అండ్‌టి ప్రభుత్వానికి లేఖ రాయడం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తనపై పరువు నష్టం దావా వేస్తామన్న రామేశ్వర రావు ప్రకటనను స్వాగతిస్తున్నానని అన్నారు. టిఆర్‌ఎస్ మైండ్ గేమ్ తన ముందు పని చేయలేదని ఆయన చెప్పారు. మెట్రో భూములపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని అన్నారు. ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు తనతో చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
చిత్రం. . విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

No comments:

Post a Comment