Friday 19 September 2014

తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని అలియాస్ రోజ్ ! అదుర్స్..!

తొలి లింగమార్పిడి యాంకర్ ఎవరో మీకు తెలుసా? పద్మినీ ప్రకాశ్ (31)నే నండి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పద్మిని ప్రస్తుతం లోటస్ చానల్లో న్యూస్ రీడర్-కం-యాంకర్‌గా పనిచేస్తున్నారు. దేశంలో న్యూస్ రీడర్ అవతారమెత్తిన తొలి ట్రాన్స్ జెండర్‌గా పేరుపొందారు. లోటస్ చానల్లో రాత్రి ఏడింటికి ప్రసారమయ్యే స్పెషల్ బులెటిన్‌లో వార్తలు చదివేది పద్మినే. 
 
బికాం ఫస్టియర్లో ఉన్నప్పుడు కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న ఈ ట్రాన్స్ జెండర్, అనంతరం, భరతనాట్య శిక్షకురాలిగా ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం తన జీవిత భాగస్వామి వెళ్ళకినార్‌తో కలిసి కోయంబత్తూరు శివార్లలో నివాసముంటున్న పద్మిని, అనేక అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు కూడా.
 
దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ టీవీ హోస్టుగా పేరు తెచ్చుకున్న రోజ్ వెంకటేశన్ మాట్లాడుతూ, పద్మిని ఎంతో పట్టుదల గల వ్యక్తని, అందుకే, ఆమెను న్యూస్ యాంకర్ పోస్టుకు రికమెండ్ చేశానని తెలిపారు. లోటస్ చానల్ ప్రతినిధులు పద్మిని గురించి అడగ్గానే, వృత్తిపరమైన ఒత్తిళ్ళు తట్టుకోగలదని, ఉద్యోగంలోకి తీసుకోవచ్చని చెప్పానన్నారు. 
 
లోటస్ చానల్ యాజమాన్యం కూడా పద్మిని విధి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తోంది. పద్మిని కష్టించి పనిచేస్తారని చానల్ చైర్మన్ జీకేఎస్ సెల్వకుమార్ కితాబిచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం, ఆమె అద్భుతమైన న్యూస్ యాంకర్ అవుతుందని నిర్ధారించుకున్నామని తెలిపారు.
 
తన వృత్తి పట్ల పద్మిని మాట్లాడుతూ, తొలినాళ్ళలో ఉచ్చారణ పట్ల ఎంతో ఆందోళనకు గురయ్యేదాన్నని, వార్తల స్వభావానికి తగిన విధంగా గొంతులో భావాలు పలికించేందుకు కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇప్పుడా సమస్యలన్నీ అధిగమించానని తెలిపారు.

No comments:

Post a Comment