Sunday 14 September 2014

ఉద్రిక్తత: భారత్ భూభాగంలో మళ్లీ చైనా టెంట్లు!

న్యూఢిల్లీ: మరోసారి భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తెందుకు చైనా సైనికులు కారణమవుతున్నారు. చైనా సైనికులు సరిహద్దుల్లో సుమారు 500 మీటర్ల మేర మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి టెంట్లు వేయడంతో భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తినట్లు ఆదివారం మీడియా వార్తలు వెల్లడించాయి. సెప్టెంబర్ 11న దాదాపు 30 మంది చైనా సైనికులు లడఖ్‌లోని దేమ్‌చాక్ ప్రాంతంలో మన భూభాగంలోకి సుమారు 500 మీటర్ల మేర చొచ్చుకు వచ్చినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. అయితే వారిని ఎదుర్కోవడానికి ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటిబిపి)కి చెందిన సుమారు 70 మంది జవాన్లను ఆ ప్రాంతంలో మోహరించారు. ఆగస్టు నెలలో కూడా చైనా సైనికులు దాదాపు 25 కిలోమీటర్ల దూరం మన భూభాగంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. లడఖ్‌లోని బుర్ట్‌సే ప్రాంతంలో వారు ఈ చొరబాటు జరిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు సముద్ర మట్టానికి సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉత్తర లడఖ్‌లోని బుర్ట్‌సే ప్రాంతంలో ఉన్న తమ స్థావరం నుంచి అనుమానాస్పదంగా కదులుతున్న విషయాన్ని భారత సైన్యానికి చెందిన గస్తీబృందం గమనించి అధికారుల దృష్టికి తీసుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకే చైనా సైనికులు మన భూభాగంలోకి అక్రమంగా చొరబడిన సంఘటనలు 334 జరిగాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మన దేశ పర్యటనకు రానున్న కొద్ది రోజుల ముందు తాజా చొరబాటు చోటు చేసుకోవడం గమనార్హం.



No comments:

Post a Comment