Monday 15 September 2014

మజ్లిస్, బీజేపీపై డిగ్గీ ఆగ్రహం, గ్రేటర్లో ఒక్కట్లేదని బాధ

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం మజ్లిస్, భారతీయ జనతా పార్టీల పైన మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడారు. ఇతర ప్రాంతాల వారికి నష్టం కలిగించేలా విభజన చట్టంలో పేర్కొనకపోయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ గెలవకపోవడం బాధాకరమన్నారు. మజ్లిస్, బీజేపీలో మత ధోరణితో ఆలోచిస్తాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొడతాయన్నారు. మజ్లిస్ తీరును తాము ఎట్టి పరిస్థితుల్లోను సహించే ప్రసక్తి లేదన్నారు. తమకు లౌకికత్వం కావాలన్నారు. అంతకుముందు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పట్ల ఎవరు నిరూత్సాహపడవద్దని, భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ వంటిదన్నారు. ఇప్పటికీ తెలుగేతరులు హైదరాబాదుకు వస్తున్నారని, భవిష్యత్తులోను వస్తారన్నారు. హైదరాబాదులోని అన్ని వర్గాల ప్రజల రక్షణ బాధ్యత కాంగ్రెసు పార్టీ తీసుకుంటుందని జైపాల్ రెడ్డి చెప్పారు. మానవతావాదాన్ని నమ్మె పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆయన అన్నారు. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకున్నది తానేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెరాస పాత్ర ఏమాత్రం లేదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో జత కడుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలవాలంటే కాంగ్రెసు నేతలు సెటిలర్లకు అండగా నిలవాలన్నారు.

No comments:

Post a Comment