Sunday 14 September 2014

పదవుల కోసం బీజేపీ-శివసేన సిగపట్లు...

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమదేనని శివసేన తేల్చి చెప్పేసింది. సీట్లు ఎక్కువ కావాలనుకుంటే బీజేపీతో పొత్తే అక్కర్లేదని ఆ పార్టీ ముందే తేల్చేసింది. శివసేనను చూసి బీజేపీ మండి పడిపోతోంది. సీఎం పోస్టు ఇచ్చే సమస్యే లేదని, అసలిప్పుడు దాని గురించి మాట్లాడేదే లేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే మిత్రుల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రంపై పొత్తుల ఎత్తులు కత్తులు దూసుకుంటున్నాయి.
పదేళ్లుగా కాంగ్రెస్‌- ఎన్సీపీలదే అధికారం
మహారాష్ట్ర లో పదేళ్ల నుంచి కాంగ్రెస్‌- ఎన్సీపీ కూటమి అధికారం చలాయిస్తుంది. శివసేనను అధికారంలో చూడాలనుకున్న టైగర్‌ బాల్‌ థాక్రే, కోరిక తీరకుండానే చనిపోయారు. ఇప్పుడాయన వారసులు ఆయన కోరిక తీర్చాలనే పట్టుదలలో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత
కాంగ్రెస్‌- ఎన్సీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని మొన్ననే జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తెలిసింది. ఆదర్శ్‌ స్కామ్‌తో పరువు పోగొట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల కోసం నానా పాట్లు పడుతోంది. పైగా కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య దూరం కూడా పెరిగింది. ఈ పరిణామాలే బిజెపి, శివసేన కూటమిలో ఆశలు భారీగా పెంచేస్తున్నాయి.
'మాకే అనుకూలం'
లోక్‌సభ ఫలితాలు, కాంగ్రెస్‌ -ఎన్సీపీ కూటమిపై అసంతృప్తి తమకు విజయాన్ని ఖాయంగా తెచ్చిపెడతాయని బీజేపీ, శివసేనలు గట్టిగా నమ్ముతున్నాయి. అప్పుడే అధికారం కోసం కొట్లాడుకుంటున్నాయి. అయితే మోడీ మూడు నెలల పాలనపై ప్రజలు సుముఖంగా లేరని, పైగా వీరిద్దరి మధ్య విబేధాలు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్‌- ఎన్సీపీ కూటమి భావిస్తోంది. ఏమౌతుందో కాలమే నిర్ణయిస్తుంది.

No comments:

Post a Comment