Sunday 14 September 2014

నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ..

ఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానునుంది. కొన్నాళ్లుగా నలుగుతున్న అఖిలభారత అధికారుల కేటాయింపు అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఏ అధికారి ఎటు వెళ్లాలి..? అనే అంశంపై ప్రత్యూష్‌ సిన్హా కమిటీ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన అధికారుల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాదనలు వినిపించిన నేపథ్యంలో రోస్టర్‌ విధానాన్ని అనుసరించి ఐఏఎస్‌లను విభజించేందుకు సిన్హా కమిటీ సిద్ధమైందని సమాచారం.
తొలుత చేసిన కేటాయింపుల్లో స్థానాలు తారుమారు..
తొలుత చేసిన కేటాయింపుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో కీలక పాత్ర పోషిస్తున్న వారి స్థానాలు తారుమారయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 53 మంది అధికారులను ఆంధ్రాకు కేటాయించాల్సి వచ్చింది. ఇందులో పూనం మాలకొండయ్య, టి.రాధ, వికాస్‌ రాజ్‌, సోమేష్‌ కుమార్‌ వంటివారు ఉన్నారు. మరోవైపు ఏపీ ఉద్యో గుల పంపిణీలో కీలకంగా పనిచేసిన పి.వి. రమేష్‌తోపాటు, ఆదిత్యనాథ్‌ దాస్‌, నవీన్‌ మిట్టల్‌ వంటివారు తెలంగాణకు వచ్చారు.
ఇబ్బందిగా మారిన స్థానాల తారుమారు
ఈ పరిణామం కొందరు అధికారులకు ఇబ్బందిగా మారింది. తమకు ఫలానా రాష్ట్రంలోనే పోస్టింగ్‌ కావాలని కూడా కొందరు లాబీయింగ్‌ చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఎవరు ఎటు వెళ్లాలనేది మాత్రం సోమవారం నాటి ప్రత్యూష్‌ సిన్హా భేటీలో తేలిపోనుందని సమాచారం. కానీ.. ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ విధానానికి అలవాటు పడ్డ అధికారులు.., ఆ తర్వాత మరో ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పని చేయడం ఇబ్బంది కలుగుతుందేమో అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఇద్దరు సీఎంలు స్పందించాలి..
సమస్య సామరస్యంగా పరిష్కారమవ్వాలంటే ఇద్దరు సీఎంలు స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. మరోవైపు గవర్నర్‌ నరసింహన్‌ కూడా ఢిల్లీబాట పట్టారు. కీలక అంశాలతోపాటు.. అధికారుల విభజనకు సంబంధించి గవర్నర్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment