Saturday 13 September 2014

రాజధానికి అథారిటీ

సిఎం చైర్మన్‌గా, ఐఏఎస్ సిఇఓగా ఏర్పాటు
జనం మధ్యే కొత్త రాజధాని నిర్మాణం
అధ్యయనంతో న్యూ చండీగఢ్‌కు ఓటు
లాండ్ పూలింగ్‌పైనే రాష్ట్రం ఆశలు గుంటూరు, తెనాలి, గన్నవరం, ఇబ్రహీంపట్నం చుట్టూ రింగురోడ్డు
శాఖల తరలింపుపై ఉన్నతాధికారులతో కమిటీ
=================
హైదరాబాద్, సెప్టెంబర్ 13: కొత్త రాజధాని కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉడా, తుడా, విజిటిఎం మాదిరిగానే రాజధాని ప్రాంతంలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు శనివారం జరిగిన రాజధాని సలహా సంఘం సమావేశంలో నిర్ణయించారు. విజిటిఎంతో సంబంధం లేకుండా ప్రత్యేక సంస్థగా కొనసాగేలా నిర్ణయించారు. సంస్థకు ముఖ్యమంత్రి అధ్యక్షునిగా, సీనియర్ ఐఏఎస్ అధికారి సిఇఓగా ఉంటారు. ఇలాఉండగా, రాజధాని నిర్మాణం కోసం భిన్న ప్రాంతాల్లో అధ్యయనం చేసి వచ్చిన మంత్రి నారాయణ కమిటీ అనేక కోణాల్లో అధ్యయనం చేసినప్పటికీ లాభనష్టాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా భవన నిర్మాణాలు ఏలా ఉండాలి? భూసేకరణ ఎలా ఉండాలన్న అంశంపై చేసిన అధ్యయనం అవగాహన పెంచేందుకు ఉపయుక్తంగా ఉన్నప్పటికీ నిర్ధిష్టమైన నిర్ణయం ఖరారు చేయలేకపోయారు. నయా రాయపూర్‌ను ఎనిమిది వేల ఎకరాల్లో, గాంధీనగర్‌ను 5700 ఎకరాల్లో, చండీగఢ్‌ను ఏడు వేల ఎకరాల్లో నిర్మించారు. ఇప్పుడు రాష్ట్ర రాజధానికి కూడా దాదాపుగా అంతే మొత్తంలో భూమి అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నారాయణ బృందం నయా రాయపూర్, గాంధీనగర్, చండీగఢ్‌లను అధ్యయనం చేసింది. ఉన్నంతలో చండీగఢ్ రాజధాని నిర్మాణం బాగుందని గుర్తించినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇక్కడి నిర్మాణాలు మానవాకృతిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక నయా రాయపూర్‌లో నిర్మాణాలు బాగున్నప్పటికీ ప్రజలు ఎక్కువగా ఉండటం లేదని గుర్తించారు. అక్కడ విద్య, వైద్యంవంటి రంగాల్లో సౌకర్యాలు మెరుగ్గా లేకపోవడంతో ఉద్యోగులు కూడా రాయపూర్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే నయా రాయపూర్‌లో నిర్మించిన వసతులు కూడా నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించారు. ఇక గాంధీనగర్‌లోనూ ఇటువంటి సమస్యలే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో ఇటువంటి వౌలిక వసతుల సమస్యలు రాకుండా చూడాలని కమిటీ నిర్ణయించినట్టు నారాయణ చెప్పారు. మొత్తంమీద జనం ఉన్నచోటే, జనానికి అందుబాటులో ఉన్న ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, భూసేకరణ అంశంపైనా కమిటీ ప్రధానంగానే దృష్టి సారించింది. మూడు ప్రాంతాల్లో ముందుగా భూసేకరణ ద్వారా, తరువాత లాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించారు. కొత్త చండీగఢ్‌లో ల్యాండ్ పూలింగ్ ద్వారానే అభివృద్ధి జరుగుతోందని మంత్రి నారాయణ చెప్పారు. గాంధీనగర్‌ను నదికి ఉత్తరాన నిర్మించారని, ఇప్పుడు దక్షిణంగా కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇలాఉండగా, ల్యాండ్ పూలింగ్ ద్వారా పంజాబ్‌లో రైతులకు 27.5 శాతాన్ని, గాంధీనగర్‌లో 35 శాతాన్ని, నయా రాయపూర్‌లో 40 శాతాన్ని అందిస్తున్నారని, నయా రాయపూర్‌లో మూడేళ్ల అధివృద్ధి అనంతరం రైతుకు లభించే మొత్తంలో ఏభై శాతాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం ఉందని నారాయణ వివరించారు. ఇక రాష్ట్రంలో అమలుచేసే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా విజయవాడ- గుంటూరు మధ్యలో రైతులు ముందుకు వస్తున్నారని, మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, ముందుకొచ్చే రైతులు ఎంతమంది అన్న వివరాలు అందించాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. బుధవారం నాటికి ఈ వివరాలు అందుబాటులో ఉంటాయని వ్యాఖ్యానించారు.
గుంటూరు, తెనాలి, గన్నవరం, ఇబ్రహీంపట్నం మధ్య 184 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు ఆరు లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు వివరించారు. ఈ రింగ్ రోడ్డు హైదరాబాద్ రింగ్ రోడ్డు కంటే పెద్దదని వ్యాఖ్యానించారు. తొలిదశలో సచివాలయం, శాసనసభల నిర్మాణం జరుగుతుందని, అనంతరం ఇతర నిర్మాణాలు జరుగుతాయన్నారు.
శాఖల తరలింపుపైనా సర్కారు వేగంగా అడుగులేస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు శాఖలను తరలించే ప్రక్రియకోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్ధిక, రవాణా, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాథాన్యతాపరంగా ఏ శాఖలను ముందుగా తరలించాల్సి ఉంటుంది, ఎక్కడ వాటిని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది, దానికోసం ఎంత స్థలం, భవనాలు అవసరం అవుతాయి, అద్దెకు తీసుకుంటే ఎంత మొత్తం ఖర్చవుతుందన్న కోణాల్లో పదిహేను రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. (చిత్రం) మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

No comments:

Post a Comment