Friday 12 September 2014

పోలవరంపై ముందడుగు : ఆ రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు టూర్!

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలతో ఆయన చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు. 
 
వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులతో ముఖాముఖి చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ రాజధానిని కూడా స్వయంగా అధ్యయనం చేసి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అనుసరించాల్సి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని యోచిస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి హోదాలో ఇతర రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటించడం ఇదే తొలిసారి కాగా, పోలవరంపై ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలతో చర్చలకు స్వయంగా వెళ్లడం కూడా ఇదే తొలిసారి. కొత్త రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అత్యవసరంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.  
 
మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందుగా ఛత్తీస్‌గఢ్, ఒడిషా అభ్యంతరాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. 

No comments:

Post a Comment