Monday 15 September 2014

పీవీకి భారతరత్న : తెలంగాణ సర్కారు సిఫారసు

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరును భారతరత్నకు, తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును పద్మవిభూషణ్‌ అవార్డుకు తెలంగాణ సర్కారు సిఫారసు చేసింది. జయశంకర్‌తోపాటు మరో విద్యావేత్త, ఇగ్నోతో సహా పలు విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి.రామిరెడ్డి పేరును కూడా పద్మవిభూషణ్‌ అవార్డుకు సిఫారసు చేస్తూ ప్రతిపాదనలు పంపించింది. 
pv narasimha rao 
అలాగే, మరో 24 మంది పేర్లను వివిధ అవార్డులకు సిఫారసు చేసింది. ఇందులో కళాకారుడు వైకుంఠం, నాట్యం విభాగంలో మాజీ కేంద్ర మంత్రి శివశంకర్‌ కోడలు అలేఖ్య, మహిళా క్రికెటర్‌ మిథాలిరాజ్‌, కళాకారులు, రచయితల విభాగంలో గోరేటి వెంకన్న, అందెశ్రీలు, దర్శక, రచయితల విభాగంలో నరసింగరావు, పెయింటింగ్‌ విభాగంలో లక్ష్మణ్‌గౌడ్‌ పేర్ల పద్మ పురస్కారాల కోసం సిఫారసు చేశారు. 
 
ఈ మేరకు.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఈ జాబితాకు ఆమోదముద్ర వేసి, కేంద్రానికి పంపించింది. కాగా, తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ అత్యంత కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కెసీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితంగా మెలిగారు. జి.రామిరెడ్డి విద్యారంగానికి విశేష సేవలు అందించటంతో ఆయన పేరును పద్మవిభూషణ్‌కు సిఫారసు చేశారు. 

No comments:

Post a Comment