Thursday 16 October 2014

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. 22న మంత్రివర్గ విస్తరణ ఖాయమా?

k chandrasekhar raoతెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం రాత్రి సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు ఏకబిగువున 2 గంటల పాటు చర్చలు జరిపారు. కేసీఆర్ ఉన్నట్టుండి గవర్నర్‌ను కలవడంతో మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు చెలరేగాయి. దీంతో ఖచ్చితంగా ఈనెల 22వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణుల భావిస్తున్నాయి. 
 
వాస్తవానికి దీపావళి తర్వాత ఈనెల చివరి వారం లేదా నవంబర్‌లో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో విపక్షాలను ధీటుగా ఎదుర్కోవటానికి మంత్రివర్గాన్ని విస్తరించాలనే యోచనతో సీఎం ఉన్నట్లు టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలు చెబుతున్నారు. మంత్రుల సంఖ్య తక్కువగా ఉంటే, విపక్షాల నుంచి శాఖల వారీగా లేదా ఇతరత్రా వచ్చే ప్రశ్నలకు జవాబులివ్వటంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విస్తరణ దిశగా ఆలోచన చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
 
ఈ మేరకు మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా, అందులో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్‌, జూపల్లి కృష్ణారావు, కొత్తగా పార్టీలో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు పేర్లు ఖాయమైనట్లేనని సమాచారం. మిగిలిన మూడు బెర్త్‌లకు ఆశావహుల సంఖ్య అధికంగా ఉండగా, సీఎం కేసీఆర్‌ అందులో ఎవరిని తన మంత్రివర్గంలోకి తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంటుందని అంటున్నారు. టీఆర్‌ఎస్‌లోని మరికొందరు నేతలు మాత్రం ఈనెల 22న మంత్రివర్గ విస్తరణ చేపట్టే ప్రచారాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. 

No comments:

Post a Comment