Wednesday 8 October 2014

ఏపీకి పొంచి ఉన్న పెనుతుఫాను, సైక్లోన్ పేరు హుధుద్

విశాఖపట్నం: మరో పెను తుఫాను ముంచుకొస్తోంది. ఈ కొత్త సైక్లోన్‌ను హుధుద్‌గా నామకరణం చేశారు. గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో కూడిన హుధుద్‌ తుఫాన్‌ ముంచుకొస్తోంది. ఉత్తర అండమాన్‌లో తీవ్రవాయుగుండంగా మొదలై బుధవారానికి తుఫాన్‌గా మారి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి బుధవారం అండమాన్‌ నికోబార్‌ దీవుల వద్ద తీరం దాటింది. ఆపై ఉత్తర అండమాన్‌, దానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా రాష్ట్రాల దిశగా దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల దూరంలోనూ.. ఒడిసాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి గురువారం ఉదయానికి పెనుతుఫాన్‌గా మారనుంది. అక్కణ్నుంచీ ఉత్తరకోస్తా, దక్షిణ దిశగా ఒడిసా వైపునకు పయనించి పదో తేదీ రాత్రికి తీవ్ర పెను తుఫానుగా మారుంది. 12వ తేదీ మధ్యాహ్నానికి విశాఖపట్నం- గోపాల్‌ పూర్‌ మధ్య తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ బుధవారం రాత్రి 8.30కు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. హుధుద్‌ తుఫాను తీరం దిశగా వచ్చే కొద్దీ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిసాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక బులెటిన్‌ను జారీచేసింది. శనివారం నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ ఒడిసాలో భారీ వర్షాలతో పాటు కొన్నిచోట్ల కుంభవృష్టి కురుస్తుంది. శనివారం ఉదయం నుంచి గాలుల ఉధృతి పెరుగుతుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, ఒక్కోసారి 70 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయి. 12వ తేదీ ఉదయం నుంచి గాలుల ఉధృతి మరింత పెరిగి గంటకు 130 నుంచి 140 ఒక్కోసారి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. శనివారం నుంచే సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుంది. కాకినాడ తీరం నుంచి ఒడిసా తీరం దాకా గురు, శుక్రవారాల్లో 6 నుంచి 9 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడే ప్రమాదం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సముద్రంలో చేపల వేటను పూర్తిగా నిలిపివేయాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూరిళ్లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థపై ఈ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలపైనా ప్రభావం చూపుతుందని, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. విశాఖకు తుఫాన్‌ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. హుధుద్ కారణంగా ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది. ఉత్తరాంధ్రకు దీని వల్ల ముప్పు వాటిల్లే అవకాశముంది.

No comments:

Post a Comment