Thursday 9 October 2014

అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వలసలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి

అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్‌ఎస్‌... టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించడాన్ని ఒక వ్యూహంగా ఈ పార్టీలు అమలుచేస్తుండటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కారణం అవుతోంది. తాజాగా తెలంగాణలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే పరిస్థితిని సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ ఎదుర్కొంది. వైసీపీ అధినేత ప్రోత్సాహంతో పెద్ద సంఖ్యలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు పార్టీని వీడారు. కానీ ఎన్నికల్లో వైసీపీకి దీనివల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో వలసలు ఆగిపోయి, ఆ పార్టీలోకే పలువురు రావడం మొదలయింది.
ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి ఈ బెడద పట్టుకొంది. టీడీపీలోని ప్రతి ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌ నేతలు తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం, ఇందులో కొందరితో సీఎం కేసీఆర్‌ స్వయంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు గురువారం ఉదయం ప్రకటించారు. కానీ కొద్ది గంటల్లోనే వారిలో ప్రకాశ్‌గౌడ్‌ టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకొని తాను పార్టీ వీడటం లేదని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా పార్టీ మార్పుపై ఊగిసలాటలో ఉన్నారని, ఏం జరుగుతుందో చూడాలని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ ఫిరాయింపులు తెలంగాణలో టీడీపీ నేతలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.  ‘గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలంతా పార్టీ వల్ల గెలిచారు. ఇక్కడ రాజకీయ వాతావరణం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారు గెలిచారు తప్ప, స్వయం శక్తితో కాదు. ఒకరిద్దరు పోయినా క్షేత్రస్థాయిలో ఓటర్లపై అది ఏమాత్రం ప్రభావం చూపదు’ అని ఒక సీనియర్‌ నేత పేర్కొన్నారు.
మార్చలేదని ఆయన... మార్చినా ఈయన!
ఖమ్మం జిల్లాలో తాను అడిగిన సీటుకు తనను మార్చలేదన్న కోపంతో మాజీ మంత్రి తుమ్మల పార్టీని వీడారు.  మాజీ మంత్రి తలసానిని కోరిన సీటు(సనత్‌నగర్‌)కు మార్చినా వెళ్లిపోయారు. వైఎస్‌ సీఎంగా ఉండగా తలసాని ఆ పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నించారని, కానీ ఆయన చనిపోవడంతో ఆగిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం సీటు కోసం బీజేపీ గట్టిగా పట్టుపట్టింది. అయినా ఆ పార్టీ నేతలకు నచ్చజెప్పి ఆ సీటును తీగల కృష్ణారెడ్డికి చంద్రబాబు ఇచ్చారు. అయినా తీగల కూడా పార్టీని వీడారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని టీడీపీ నేతల్లో అగ్ర ప్రాధాన్యం తీగలకే ద క్కింది. ‘హుడా’ చైర్మన్‌ పదవి, మేయర్‌ పదవీ ఇచ్చారు. అలాంటి తీగల పార్టీ మారడం చంద్రబాబును కూడా విస్మయపర్చింది.

No comments:

Post a Comment