Tuesday 21 October 2014

టీడీపీ ఎమ్మెల్యే పేరిట పరీక్ష రాస్తూ కెమెరాకు చిక్కాడు

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగ్‌పూర్‌లో ఉండగా సోమవారం నాడు ఓ పరీక్షా కేంద్రంలో ఆయన స్థానంలో ఓ యువకుడు ఇంటర్ పరీక్ష రాస్తూ కెమెరాలకు చిక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోమవారం నాటి పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరయ్యారంటూ స్క్వాడ్ అధికారి షేక్ రషీద్ చెబుతున్నారు. గుట్టురట్టు కావటంతో ఆయన గైర్హాజరైనట్లు చూపుతున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వన్ సిట్టింగ్‌లో ఇంటర్ కోర్సు పూర్తి చేసేందుకు ప్రసాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కోర్సుకు గంగూరులోని ఓ మహిళా కళాశాల ద్వారా ఇటీవల పరీక్ష ఫీజు చెల్లించారు. సెప్టెంబర్ 27న ప్రారంభమై నవంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు పెనమలూరు మండలం పోరంకిలోని తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవిఎస్ జూనియర్ కళాశాలను కేంద్రంగా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పరీక్షలు జరిగాయి. ప్రసాద్ హాల్ టిక్కెట్ నెంబర్‌తో రెండు పరీక్షలకు హాజరైనట్లు రికార్డుల ద్వారా తెలుస్తోందంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన సింగ్‌పూర్ వెళ్లారు. సోమవారం నాలుగో పరీక్షకు ఓ యువకుడు హాజరై ప్రసాద్ పేరిట ఆన్సర్ షీటుపై సంతకం కూడా చేసినట్లు కొందరు అభ్యర్థులు సెల్‌ఫోన్ ద్వారా తీసిన ఫొటో ద్వారా తెలుస్తోందని చెబుతున్నారు. అయితే ఈ రహస్యం బైటకు పొక్కటంతో పరీక్ష రాసినట్లుగా భావిస్తున్న యువకుడు అదృశ్యమయ్యాడు. మరోవైపు, పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరైనట్లు పరీక్ష ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నమోదు చేశామని చెబుతున్నారు. సోమవారం పరీక్షకు 480 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 408 మంది హాజరయ్యారు. ప్రసాద్ రాయాల్సిన పరీక్షను ఆయన పేరుతో మరొకరు రాసిన సంఘటనపై విచారణ జరిపించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. బోడె ప్రసాద్‌కు ఇంటర్మీడియట్ పరీక్షలు ఇబ్బంది తెచ్చిపెట్టాయని అంటున్నారు. సోమవారం భౌతిక శాస్త్రం పరీక్ష రాస్తుండగా.. కేంద్రంలో ఉన్న కొందరు అభ్యర్థులు ఎమ్మెల్యే స్థానంలో గుర్తు తెలియని యువకుడు పరీక్ష రాస్తున్నాడంటూ ఆ యువకుడి ఫోటోలు, సమాధాన పత్రాలను సెల్‌ఫోన్లో వాట్సప్, ఎస్సెమ్మెస్ ద్వారా బయటకు చేరవేశారు. విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పరీక్ష కేంద్రానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీరిని పరీక్ష కేంద్రంలోకి తొలుత నిరాకరించినా, తర్వాత వెళ్లనిచ్చారు. అయితే, అప్పటికి ఎమ్మెల్యేకు కేటాయించిన స్థానం ఖాళీగా కనిపించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ప్రసాద్ పేరుతో ఉన్న సమాధాన పత్రం ఫోటోను అధికారులకు చూపించారు. ఫోటోలను పరిగణించబోమని నిజపత్రాలనే ప్రమాణంగా తీసుకుంటామని అధికారులు చెప్పారు. ప్రసాద్ పరీక్షలకు హాజరు కాలేదని వారు చెప్పారు. సింగపూర్లో ఉండటంతో సోమవారం నాటి పరీక్షకు తాను హాజరు కాలేదని, దీనిని గమనించిన ప్రత్యర్థులు తన పైన కుట్ర పన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని బోడె ప్రసాద్ అన్నారు.

No comments:

Post a Comment