Friday 17 October 2014

నేడే జయ విడుదల

కర్నాటక : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో జయలలితకు షరతులతో కూడిన మధ్యంతర బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. దీంతో జయ శనివారం జైలు నుంచి విడుదల కానుంది.  కోర్టు నిర్ణయంతో  సెప్టెంబర్ 27 నుంచి గత 20 రోజులుగా బెంగుళూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయకు గొప్ప ఊరట లభించింది. అయితే బెంగుళూరు ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష నిలుపుదలే కానీ రద్దు కాదని కోర్టు స్పష్టం పేర్కొది. శిక్షపై రెండు నెలల స్టే విధించింది.  సమగ్ర వివరాలు పత్రాలతో అప్పీలుకు సుప్రీంకోర్టు రెండు నెలల గడువు ఇచ్చింది. 35 వేల రూపాయల పూచికత్తుపై 18 డిసెంబర్ లోగా ఆమె కోర్టుకు దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు నెలలకన్నా ఒక్కరోజు కూడా సమయం ఇవ్వమని సుప్రీం స్పష్టం చేసింది. జయతో పాటు ఆమె సమీప బంధువులు శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా కోర్టు బెయిల్ మంజూరైంది.
బెయిల్ దక్కినా విడుదలకు ఆటంకం..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసినా వెంటనే విడుదలకు వీలు కాలేదు. షరతులతో కూడిన జామీను ప్రతి సకాలంలో బెంగళూరులోని సంబంధిత అధికారులకు చేరలేదు. శనివారం ఈ ఉత్వర్వులను అందచేశాక ఆమె జైలు నుండి విడుదల కానున్నారు. 
రెండు నెలలు జయ ఇంట్లోనే..
జైలు నుంచి విడుదలైన తరువాత రెండు నెలల పాటు జయ ఇంట్లోనో ఉండాలని కోర్టు షరతు విధించింది. తమిళనాడులో హింసాత్మక ఘటనలు జరక్కుండా కార్యకర్తలను అదుపులో ఉండేలా చూడాలని కోర్టు ఆదేశించింది. దీంతో తాను ఇంటికే పరిమితమవుతానని కోర్టుకు జయ హామీ ఇచ్చారు. తమిళనాడులో హింసాత్మక ఘటనలు జరగకుండా చూస్తామని జయలలిత తరపున వాదించిన నారిమన్ కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. 
జయలలితకు షరతులతో కూడిన బెయిలు..
ఇదిలా ఉంటే జయలలితకు షరతులతో కూడిన బెయిలు మాత్రమే మంజూరైందని  బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. డిసెంబర్ 18 వరకు ఆమె అప్పీలు పత్రాలు సమర్పించకపోయినా ...తమిళనాడులో  శాంతి భద్రతలకు విఘాతం కలిగినా బెయిలు రద్దయ్యే అవకాశముందని సుబ్రహ్మణ్యస్వామి చెప్పాడు. సుబ్రహ్మణ్యస్వామి అక్రమ ఆస్తులకు సంబంధించి జయపై కేసు వేసిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే సంబురాలు..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయను దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. బెంగుళూరు హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ రద్దు కాగా జయ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయకు బెయిలు మంజూరు కావడంతో తమిళనాడులో అన్నాడిఎంకే కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

No comments:

Post a Comment