Tuesday 21 October 2014

ఆళ్లగడ్డ ఏకపక్షమే: టిడిపి, కాంగ్రెస్ పోటీకి దూరం

హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి అక్టోబర్ నెలలో జరగాల్సిన ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సోమవారం ప్రకటించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అయితే విజయలక్ష్మి పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. చిన్నాచితకా పార్టీలు పోటీచేస్తామని ప్రకటించడంతో పోటీ చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో వారు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కాగా ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. పోటీలో ఎవరూ లేకపోతే అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నపానికి స్పందించని వారు ఎవరైనా నామినేషన్ వేసినా ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశముంది. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడం లేదని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. నంద్యాల ఎమ్మెల్యే, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఆనవాయితీలను పాటిస్తూ పోటీ నుంచి తప్పుకోవడం హర్షనీయమని వారు పేర్కొన్నారు. కాగా, కాగా, ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 12న ఓట్ల లెక్కింపు జరగనుంది.

No comments:

Post a Comment